ఆంధ్రప్రదేశ్‌ను పాలించే హక్కు కేవలం తమకే వుందని ఎల్లో టీమ్ భావన. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలతో మైండ్ గేమ్ ఆడడం పచ్చ బ్యాచ్‌కు వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శ లేకపోలేదు. తాజాగా ఏపీలో కూటమిదే అధికారం అంటూ పచ్చ బ్యాచ్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
ఈ నేపథ్యంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2009లో వైఎస్సార్ నేతృత్వంలోని వైఎస్సార్‌ను ఓడించేందుకు అన్ని రాజకీయ పక్షాలు జట్టుకట్టాయి. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, టీఆర్ఎస్, వామపక్ష పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. అదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు.
హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో రెండో దఫా కాంగ్రెస్ పార్టీని వైఎస్సార్ అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ను మీడియా ప్రతినిధులు పలకరించగా… ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. పనిలో పనిగా సెటైర్ విసిరారు. నాడు ఆయన ఏమన్నారంటే…
“తెలుగుదేశం, దాని మిత్రపక్షాలు విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. తెలుగుదేశం (మహా కూటమి) అధికారంలోకి వస్తోందని విపరీతంగా హైప్ క్రియేట్ చేశాయి. దాంతో చాలా మంది భయపడ్డారు. నిజంగా మహాకూటమి అధికారంలోకి వస్తుందేమోనని. ఈ భయపడ్డ వాళ్లలో వరుణ దేవుడు కూడా ఉన్నాడు. చైనా లాంటి దూర ప్రాంతానికి వెళ్లిన వరుణ దేవుడు తిరిగి వెనక్కి వచ్చాడు. రాష్ట్రాన్ని, దేశాన్ని సంతృప్తిపరిచే విధంగా వర్షాలు కురిపిస్తున్నాడు” అంటూ వైఎస్సార్ తన ప్రత్యర్థుల్ని దెప్పి పొడిచారు.
ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. దీనికి కారణం …ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తుందని విస్తృతంగా ప్రచారం కావడమే. ఏమీ లేకపోయినా పచ్చ బ్యాచ్ ప్రచారం చేసుకోవడం ద్వారా సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడం కొత్త కాదనే అభిప్రాయాన్ని వైఎస్సార్ మాటలు బలపరుస్తున్నాయి. నాటు మహాకూటమి అధికారంలోకి రానట్టే, నేడు కూటమికి అధికారం దక్కదనేందుకు వైఎస్సార్ కామెంట్స్‌ను నిదర్శనంగా చూపుతున్నారు.