మాచర్ల ప్రాంతం అనేది రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతం అని ముద్ర పడేలాగా అక్కడ ఇరుపార్టీల ఘర్షణలు విచ్చలవిడిగా రేగాయి. సహజంగానే ఇరు పార్టీలు కూడా.. తమ ప్రత్యర్థుల మీద ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం మాచర్ల మాత్రమే కాదు.. రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరిగిన అన్ని ప్రాంతాల్లోనూ సాధారణ పరిస్థితులు తిరిగి తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
ఘర్షణలు రేగిన ప్రాంతాల్లో పూర్తిగా 144 సెక్షన్ విధించి.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రగులుతున్న రావణకాష్టంలా మారిన మాచర్ల ప్రాంతంలో మరింత మంటలు ఎగదోయడానికి తెలుగుదేశం పార్టీ కుట్ర ప్రయత్నాలు చేస్తున్నది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడుల్లో గాయపడిన తెలుగుదేశం నాయకుల, కార్యకర్తలను పరామర్శించడానికి మేం వెళ్తామంటూ తెదేపా నాయకులు సిద్ధం కావడం కేవలం ఒక కుట్రగా ప్రజలు భావిస్తున్నారు. గుంటూరులోని మాచర్ల తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటినుంచి మాచర్లకు వెళ్లాలనేది వారి ప్లాన్. దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, బొండా ఉమా, జీవీ ఆంజనేయులు అంతా వెళ్లాలనుకున్నారు. ఇదే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తలపెడితే ఏమవుతుంది?
అసలే ఎంతగా పోలీసు పహరా ఉన్నప్పటికీ.. చెదురుమదురు కవ్వింపు చర్యలు జరుగుతున్న మాచర్ల ప్రాంతంలో తెలుగుదేశం పర్యటించాలనుకోవడం, కేవలం అక్కడి ఉద్రిక్తతల్ని మరింత రెచ్చగొట్టడానికి మాత్రమే అని ప్రజలు తిట్టిపోస్తున్నారు.
నాయకులకు నిజంగానే పరామర్శించాలని, తమ పార్టీ వారికి ధైర్యం చెప్పాలని అనుకుంటే.. ఫోనులో ఆ పని చేయవచ్చు. కానీ.. ఉద్రిక్తతలు ఇంకా చల్లబడని సమయంలోనే, సెక్షన్ 144 అమల్లో ఉండగానే.. పరామర్శలంటూ డ్రామా నడిపించడం కేవలం దుర్బుద్ధి మాత్రమే అని ప్రజలు ఈసడించుకుంటున్నారు.
దేవినేని ఉమామహేశ్వరరాువను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ ఛలో మాచర్లను అనుమతించకుండా మాచర్లలో ఉన్న ప్రశాంత వాతావరణం భంగపడకుండా చర్యలు తీసుకున్నారు. నిజానికి ఇలాంటి సమయంలో ఇరు పార్టీలు కూడా సంయమనం పాటించాలని ప్రజలు కోరుకుంటున్నారు.