Advertisement

Advertisement


Home > Politics - Opinion

జగన్ ముద్దు- ఎమ్మెల్యేలు వద్దు

జగన్ ముద్దు- ఎమ్మెల్యేలు వద్దు

ఎన్నికలైపోయాయి. గెలుపోటములన్నీ ఈవీయమ్ముల్లో ఉన్నాయి. జూన్ 4 వరకు ఉత్కంఠని ఓర్చుకోక తప్పదు ఇరు పక్షాల నాయకులు, వారి అనుయాయులు, అభిమానులు, ఓట్లేసిన ప్రజలూను!

వైకాపా కి 150 పై చిలుకు వస్తాయని జగన్ మోహన్ రెడ్డి చెప్పడం..దానిని ఎద్దేవా చేస్తూ గెలుపు తమదే అని కూటమి వర్గం చెప్పడం చూస్తూనే ఉన్నాం. 

నిజానికి ఫలితాలొచ్చే దాకా ఎవరి నమ్మకాన్ని వాళ్లు చాటుకోవడం సహజం. అయితే ఫలితాలకి టైముండే సరికి రకరకాల విశ్లేషణలు, ఊహాగానాలు, అనుమానాలు బయలుదేరుతున్నాయి. 

ఇప్పుడు కొత్త అనుమానమేంటంటే...చాలా నియోజకవర్గాల్లోని ప్రజల్లో "కేవలం" ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి. ఇక్కడ "కేవలం" అనే పదం వాడడానికి కారణం వారిలో ఎవరికీ జగన్ మోహన్ రెడ్డిపై అసంతృప్తి లేదు. జగనిచ్చే పథకాలు, సౌకర్యాలు అన్నీ బానే ఉన్నాయట. కనుక మళ్లీ వైకాపా ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్న వాళ్లున్నారు. కానీ స్థానికంగా వైకాపా ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతతో జగన్ మీద అభిమానమున్నా కూడా ఓటేయకుండా కూర్చున్న వాళ్లు, కోపంతో ఎగస్పార్టీకి వేసిన వాళ్లు కూడా ఉన్నారట. అంటే ఒకరకంగా ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటే. ఆలస్యంగా వెలుగుచూస్తున్న ఒకానొక అంశం ఇది. 

టీ స్టాల్లో కూర్చుని ఒక వ్యక్తిని కదిపితే, "జగన్ పాలన బానే ఉంది. కానీ మా ఎమ్మెల్యేనే మైనస్. అందుకే ఓటేయలేదు ఈ సారి" అన్నాడు. 

అదేంటని ఆరా తీస్తే, "నేను వేయకుండా ఊరుకున్నాను. అంతవరకూ సంతోషించాలి. కానీ మా ఇంట్లో వాళ్లు, బంధువులు ఎవ్వరూ అతనికి వేయకపోగా కూటమి అభ్యర్థికి వేసొచ్చారు. వాళ్లందరికీ మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని ఉంది. కానీ ఓట్లు మాత్రం అలా వేసారు" అన్నాడు. 

"ఇదేం చిచిత్రం. పక్క పార్టీకి ఓటేసి జగన్ గెలవాలని కోరుకోవడమేంటి? అలా వేస్తే జగన్ ఎలా తన పార్టీని గెలిపించుకుని ముఖ్యమంత్రి అవుతాడు?" అని అడిగితే...

"మా ఎమ్మెల్యే ఒక్కడూ ఓడితే జగన్ కి వచ్చే నష్టమేం లేదు. రాష్ట్రమంతా వైకాపా వేవ్ ఉంది. అతనే సీయం అవుతాడు. మా ఎమ్మెల్యే మాత్రం పోవాలంతే" అన్నాడు. 

రాష్ట్రంలో ఈ బాపతు ఓటర్లు ఎంతమందున్నారో అని ఆలోచన. ఎమ్మెల్యేలు స్థానికంగా ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్నారన్న రిపోర్టులతో జగన్ కొన్ని చోట్ల అభ్యర్థులని మార్చిన మాట వాస్తవం. కానీ కొన్ని ప్రాంతాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లివడం జరిగింది. ఆయా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత లేదని అనుకోవడం పొరపాటే అని ఈ టీకొట్టు సంభాషణని బట్టి అర్ధమయింది. 

ఈ తరహా ఓటింగ్ రాష్ట్రంలో విరివిగా జరిగితే వైకాపాకి ఎదురుదెబ్బే అవుతుంది. 

ఇంతకీ ఎమ్మెల్యేలపై ఎందుకంత వ్యతిరేకత? ఇదే విషయంపై తమ ఎమ్మెల్యే గురించి చెప్తూ, "ఏదైనా కేసయ్యి సెటిల్ చెయ్యాలంటే పోలీసు మామూళ్లతో పాటు ఎమ్మెల్యే మామూళ్లు కూడా ఇచ్చినొళ్లున్నారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ల దగ్గర ఆస్తి విలువను బట్టి సబ్ రిజిస్ట్రార్ జనాలతో పాటు మా ఎమ్మెల్యేకి కూడా మామూళ్లు వెళ్లాయి. ఏదైనా పెద్ద ల్యాండ్ అమ్మాలన్నా, కొనాలన్నా మా ఎమ్మెల్యేకి చెప్పి వాటా ఇచ్చి పని చేసుకోవాలి. ఇలాంటి చికాకులు చాలా ఉన్నాయి. అందుకే అతను పోవాలనుకుంటున్నాం" అన్నాడు ఆ వ్యక్తి. 

ఇసుక, మద్యం ..రెండూ ప్రభుత్వపరమైపోవడం, సివిల్ కాంట్రాక్టులు కార్పొరేట్ కంపెనీలకి ఇచ్చేయడం వంటి కారణాల వల్ల ఆ మార్గాల్లో డబ్బు సంపాదించుకోవడానికి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అవకాశం లేకుండా అయ్యింది. గత ప్రభుత్వ హయాముల్లో ఎమ్మెల్యే వర్గం మనుషులకి సివిల్ కాంట్రాక్టులు అందేవి. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, ఇసుక కాంట్రాక్టులు ఇలాంటివన్నీ బినామీలతో నడుపునే వెసులుబాటుండేది. కానీ ఇప్పుడవన్నీ లేక నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికి ఎమ్మెల్యేలు నేరుగా జనం మీద పడుతున్నారని వినికిడి. 

"అడవుల్ని కొట్టేసి ఇళ్లు కట్టేస్తుంటే పులులు ఊళ్లోకొచ్చి వేటాడినట్టు, ఉన్న అవకాశాల్ని ప్రభుత్వం లాగేసుకోవడం వల్ల ఈ ఎమ్మెల్యేలు జనం మీద పడుతున్నారు", అని ఒక పోలిక కూడా చెప్పాడు.

ఏదైనా ఇది చాలా వింతగా ఉంది. "ప్రాణం ఉండాలి--కానీ గుండె మాత్రం ఆగిపోవాలి", అనే పద్ధతిలో "జగన్ ముఖ్యమంత్రి కావాలి--కానీ ఎమ్మెల్యేలు ఓడిపోవాలి" అని కోరుకోవడం విడ్డూరమే. 

ఒక వ్యక్తిలో ఒక అభిప్రాయముందంటే, అలాంటి అభిప్రాయం కచ్చితంగా చాలా మందిలో ఉంటుంది. అయితే ఎంత మందిలో ఉంటుంది అనేది ప్రశ్న. పెద్ద సంఖ్యలో లేకపోతే పర్వాలేదు. ఒకవేళ ఊహించిన దానికంటే ఎక్కువ శాతం ప్రజల్లో ఇదే భావనుంటే వైకాపాకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు. 

ఆ రకంగా ఏమైనా దెబ్బ పడబోతోందా అని కూడా ఈ నాలుగైదు రోజులు ఆలోచించుకోవచ్చు. ఏ అభిప్రాయమైనా, విశ్లేషణ అయినా ఒక వర్గానికి అనందం, మరొక వర్గానికి భయం గొల్పడం సహజం. అలాంటి ఒక అభిప్రాయమే ఇది. 

హనుమోలు శేఖర్ బాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?