అంతేగా అంతేగా. అవును మరి దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలను గుత్తమొత్తంగా ప్రైవేట్ కి అప్పగించాలని బీజేపీ నిర్ణయించింది. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ముందు వరసలో ఉంది. ఆ ఒక్క విషయం తప్ప అన్నీ మాట్లాడేస్తున్న కమలనాధులను వారి వాగ్దాటిని చూస్తే ఎవరికైనా మండిపోదా.
అలాంటి మంటే మంత్రి గుడివాడ అమరనాధ్ లోనూ కనిపించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఏపీని ముఖ్యమంత్రి జగన్ అగ్ర స్థానంలో ఉంచారని గుడివాడ చెప్పారు. అదే బీజేపీ ఈజ్ ఆఫ్ సెల్లింగ్ లో టాప్ రేపుతోందని సెటైర్లు వేశారు. దేశంలో ఎక్కడ ప్రభుత్వ కర్మాగారం ఉన్నా దాన్ని అమ్మేయాలన్నదే బీజేపీ పాలసీ అని ఆయన విమర్శించారు.
విశాఖ వచ్చి అన్నీ మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ జీవీ నరసింహారావు ఒక తెలుగు వాడుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారు అని మోడీ సర్కార్ ని అడగలేకపోతున్నారని గుడివాడ కౌంటర్లేశారు. ఏపీలో ప్రతీ ఎన్నికలోనూ వైసీపీదే విజయం. డిపాజిట్లు కోల్పోవడం బీజేపీ నైజం అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
ప్రజాదరణతో సాగుతున్న తమ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని జీవీఎల్ కోరడంలో అర్ధముందా అని ఆయన నిలదీశారు. మొత్తానికి మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో డిపాజిట్లు కోల్పోవాలన్న సరదా మీకు బాగా ఉన్నట్లుంది అని ఆయన ఎద్దేవా చేశారు.
ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ వస్తే కూడా దానికి వక్రభాష్యం చెప్పడం బీజేపీ నేతలకే చెల్లిందని ఆయన అన్నారు. అయినా జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తల అభిప్రాయం తీసుకుని కేంద్రం ఈ ర్యాంకులను ఇస్తుందని, ఏపీలో అన్ని రకాలైన అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని గుడివాడ పేర్కొన్నారు.