రాజకీయ చౌర‌స్తాలో పవన్ కళ్యాణ్‌!

'జనసేన' పేరిట ఓ రాజకీయ పార్టీ ని 2014 ఎన్నికలకు ముందు పెట్టుకున్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ – ఇప్పటికీ రాజకీయాల్లో దారి ఎటో తెలియక తికమక పడుతున్నారా అనిపిస్తున్నది. ఒక సిద్ధాంత…

'జనసేన' పేరిట ఓ రాజకీయ పార్టీ ని 2014 ఎన్నికలకు ముందు పెట్టుకున్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ – ఇప్పటికీ రాజకీయాల్లో దారి ఎటో తెలియక తికమక పడుతున్నారా అనిపిస్తున్నది. ఒక సిద్ధాంత స్పష్టత, ఒక వాస్తవిక దృష్టితో కాకుండా, సినీ గ్లామర్ తో రాజకీయ కదన రంగంలోకి దూకడం వల్ల, జనసేనకు ఇంకా స్పష్టమైన దారి కనపడడం లేదు. 2009 లో ప్రజారాజ్యం పార్టీ ప్రకటన, నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఆ ప్రయోగాన్ని జీర్ణించుకోలేక, మళ్ళీ 'జనసేన' పేరుతో గోదాలోకి దిగేశారు.  

ఈ సారైనా వీలైనంత వాస్తవిక దృక్పథంతో ఎన్నికలకు సిద్ధమవుతారేమో చూడవలసి ఉంది. ఎందుకంటే… 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అంటే-ఒక ఆవేశం. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అంటే – ఒక అనాలోచితం. అందుకే, ఈ సారి ఎన్నికలకు-ఆవేశమూ, అనాలోచితమూ కాకుండా వాస్తవిక దృక్పథంతో ఆయన వెళ్ళాలి అని ఆయన రాజకీయాభిమానులు కోరుకుంటున్నారు (రాజకీయాభిమానులు వేరు, సినీ అభిమానులు వేరు, కులాభిమానులు వేరు.. పవన్ కళ్యాణ్ కు మూడు రకాల అభిమానులు ఉన్నారు). ఆంధ్ర రాజకీయాలలో తనకంటూ ఒక అస్తిత్వం ఉండాలి అనుకుంటే జనసేనకు పెద్దగా ఆప్షన్ లు లేవు.

2014 లో రాజకీయ ప్రవేశం చేయడమే జగన్ వ్యతిరేక, టీడీపీ అనుకూల ఎజెండాతో పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కనుక, వైసీపీతో పొత్తు అనే ప్రశ్నే ఉదయించదు. 2019 లో సిపిఐ, సిపిఎం, మాయావతి బీఎస్పీ వంటి వాటితో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. ఆ సరదా కూడా తీరింది. ఇక, మిగిలింది తెలుగుదేశం. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయడం. లేదంటే స్వంతంగా పోటీ చేయడం అనే రెండు మార్గాలే పవన్ కళ్యాణ్ ముందు ఉన్నాయి.

స్వంతంగా పోటీ చేసే విషయం చూద్దాం. గత ఎన్నికల్లో ఆయన స్వంతంగా పోటీ చేశారు. దాదాపు ఆరున్నర శాతం (పోలైన ఓట్ల లో ) ఓట్లు జనసేనకు లభించాయి. కొత్తగా పోటీ చేసే పార్టీకి ఇంత ఓట్ల శాతం లభించడం చిన్న విషయం ఏమీ కాదు. అయితే, సీట్లు గెలవడానికి ఈ శాతం సరిపోదు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి మాత్రమే ఈ ఓటింగ్ శాతం పనికి వస్తుంది. 2019 ఎన్నికల్లో అదే జరిగింది. జనసేన స్వంతంగా పోటీ చేయడం వల్ల … టీడీపీ తీవ్రంగా దెబ్బతిన్నది. అదే నిష్పత్తి లో వైసీపీ కి అది లాభించింది. కానీ, పవన్ కళ్యాణ్ కు మాత్రం ఏమాత్రం ఉపయోగపడలేదు.

స్వంతం గా పోటీ చేయాలనే ఆలోచన ఈ సారి కూడా పవన్ కళ్యాణ్ కు ఉపయోగపడదు. ఇటు వైసీపీ అటు టీడీపీ మధ్య లేగదూడలా జనసేన నలిగి పోతుంది.

రెండు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ రెండూ కూడా చావో… రేవో…. అన్నట్టుగా సామ, దాన, భేద, దండోపాయాలను తమ వనరులకు జోడించి క్షేత్ర స్థాయిలో తల పడతాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం రెండు పార్టీలకూ అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో అపజయం పాలయ్యే పార్టీ దాదాపుగా నిర్వీర్యమైపోతుంది అనే విషయం రెండు పార్టీలకు తెలుసు. దానితో, ఈ పోరు విజయమో… వీర స్వర్గమో అన్నట్టుగా ఉంటుంది. ఆ రెండింటి మధ్య జనసేన నిలువలేదు.

జనసేనకు పటిష్టమైన స్థానిక రాజకీయ నాయకత్వం లేదు. పార్టీ నిర్మాణం లేదు. నూటికి తొంభయి శాతం ఔత్సాహికులే. పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రావాలని ఉత్సాహ పడేవారే జనసేన లో ఎక్కువ. ఒక స్పష్టమైన రాజకీయ సిద్ధాంతం లేదు. క్యాడర్ లేదు. ఉన్నవారికి రాజకీయ శిక్షణ లేదు. అందువల్ల, జనసేన…. జనసేన అంటూ హడావుడి చేసేవారికి ఓ రాజకీయ నిబద్ధత సహజంగానే ఉండదు .

అసెంబ్లీ కి పోటీ చేయడానికి టిక్కెట్లు 'ఫ్రీ' గా ఇస్తారని అనుకున్నప్పటికీ (ప్రజారాజ్యం లో ఫ్రీ గా ఇవ్వలేదనే ఆరోపణలను ఎదుర్కొన్నారు ). ఎన్నికలకు 10, 15 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టగలిగిన స్థాయి కలిగిన జనసేనీయులు దాదాపుగా లేరు. డబ్బులు తీసుకోకుండా మన ఓటర్ మహాశయులు అభ్యర్థి వైపు కన్నెత్తి కూడా చూడరు. పోనీ, డబ్బులు తీసుకుని… ఓటేస్తారా అంటే గ్యారెంటీ లేదు. తెలంగాణలోని హుజురాబాద్ లో ఒక పార్టీ దగ్గర ఓటుకు ఏడు వేలు తీసుకుని, ఇంకో పార్టీ ని పాతిక వేలు మెజారిటీ తో గెలిపించారు.

అటు వైసీపీ, ఇటు టీడీపీలో టికెట్లు రాని సౌండ్ పార్టీలు … జనసేన టికెట్ పై పోటీ చేయడానికి తయారై… వాళ్ళు ఒక వేళ గెలిస్తే రాజోలు అనుభవమే పవన్ కళ్యాణ్ కు మిగులుతుంది. ఏ పార్టీ నుంచి వచ్చిన వారు ఆ పార్టీ లోకి వెళ్ళిపోతారు. సున్న కు సున్న. హళ్లి కి హళ్లి అన్నట్టు అవుతుంది, జనసేన రాజకీయం.

అయితే, ప్రజల్లో తిరగడానికీ, భావోద్వేగ ప్రసంగాలు చేయడానికి, ఆ విధంగా 'రాజకీయ సరదా' లు తీర్చుకోడానికి మాత్రం స్వంతంగా పోటీ చేయడం అనే కాన్సెప్ట్  బాగా పనికి వస్తుంది.  నాగబాబు కు కూడా ఫుల్ టైం మంచి కాలక్షేపం. రేపు దసరా నుంచి రోడ్ల మీదే ఉంటామని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. సీఎం కాన్వాయి ని తలపించే నల్లరంగు స్కార్పియోలు కొత్త వాటిని సిద్ధం చేసి ఉంచారు. (సీఎం కాన్వాయి లో కార్లన్నిటికీ ఒకే నంబరు ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లోని ఈ నల్ల స్కార్పియో లకు ఒకే నంబరు ఉందో… లేదో తెలియదు).

పవన్ ను చూడడానికి ఆయన అభిమానులు విరగబడతారు. ఇసుకేస్తే కిందకు నేల  మీద రాలదు. పర్యటన సూపర్ డూపర్  హిట్ అవుతుంది. సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆయనే తెలుగు సినీ 'డబుల్ సూపర్'  స్టార్. 'ప్రజల వద్దకు ఉచిత దర్శనం' అన్నట్టు ఆయనే ఊరూరా తిరుగుతుంటే చూడడానికి ఎవరు మాత్రం ఎగబడరు? అది ప్రజాకర్షణ. ఉచిత వినోదం.

దానికీ, ఓటింగ్ కీ బాగా తక్కువ సంబంధం ఉంటుంది. పవన్ కళ్యాణే  ఒకసారి అన్నారు, “నా సభలకు వచ్చేవారంతా నాకు ఓట్ వేస్తే…30 సీట్లు వచ్చేవి..”అని. ఇదీ వాస్తవికత .

ఇక, ఆయన ముందు ఉన్న రెండో ప్రత్యామ్నాయం – టీడీపీ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడం.

'తెలుగుదేశంతో పొత్తు' అనుకుంటే తన స్ట్రాంగ్ పాయింట్స్ ఏమిటి…. వీక్ పాయింట్స్ ఏమిటి అనే విషయమై జనసేనకు ముందుగా స్పష్టత ఉండాలి. ఏ వర్గాలలో జనసేనకు ఓట్లు పడతాయి…. ఏ వర్గాలలో ఓట్లు రాలవు అనే విషయంలో ఇప్పటికే జనసేనలో క్లారిటీ వచ్చి ఉంటుంది. ఆ స్ట్రాంగ్ పాయింట్స్‌ను టీడీపీ ముందు పెట్టి, ఎన్ని స్థానాలు అడగాలి అనే విషయం వాస్తవికత కు దగ్గరగా ఉండాలి. అప్పుడు, పొత్తు అనేది త్వరగా, అల్లరి… అసంతృప్తి లేకుండా…. ఉభయ తారకంగా కుదరడానికి  అవకాశం ఉంటుంది.

జనసేన తో పొత్తుకు టీడీపీలో కొందరు ముఖ్య నాయకులు అంత సుముఖంగా లేరని సమాచారం. టీడీపీ ఓట్ బ్యాంకు, జనసేన ఓట్ బ్యాంకు విభిన్నమైనవి కావడమే ఇందుకు ఒక ముఖ్య కారణం. టీడీపీ ఓటు జనసేనకు బదిలీ అయినంత తేలికగా జనసేన ఓట్ బ్యాంకు టీడీపీ కి బదిలీ కాదు అనే వాదన టీడీపీ లో వినిపిస్తున్నది. అందువల్ల, టీడీపీ తో పొత్తు విషయం లో ఏ మాత్రం ఓవరాక్షన్ చేసినా, అసలుకే మోసం రావచ్చు. బైబిల్ సూక్తి ని గాకుండా – 'అనువుగాని చోట….'అన్న తెలుగు సామెతను పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు అసెంబ్లీ లో జనసేన -జనసేన గా దర్శనమిస్తుంది.

అసెంబ్లీ లో జనసేన (అంటే పవన్ కళ్యాణ్ ) ఉండాల్సిన అవసరం ఉంది. మొన్న 2019 లో ఓడిపోవడమే విచారకరం. ఒక్క స్థానం లో అయినా ఆయన గెలిచి ఉండాల్సింది. ఆయన శాసనసభలో ఉంటే… కొన్ని ప్రశ్నలైనా అడిగి ఉండేవారు కదా! అవి జనం లోకి బలంగా వెళ్లి ఉండేవి కూడా. అవే ప్రశ్నలను టీడీపీ వారు అడిగిన దానికంటే పవన్ అడిగితే, వాటికి గ్లామర్ ఎక్కువ. ఫోర్స్ ఎక్కువ.

అందుకే, ఎన్నికల అనంతరం ఏర్పడే శాసన సభలో ఆయనా ఉండాలి. ఆయనతో పాటు,కొందరు జనసేనీయులూ ఉండాలి. అప్పుడే అది ' మెగా పవర్ హౌస్ ' అవుతుంది. అందుకే, వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తూ, పవన్ కళ్యాణ్ ప్రాక్టికల్ గా వ్యవహరిస్తే, అసెంబ్లీ కీ దారి కనిపిస్తుంది. గౌరవ ప్రదమైన రాజకీయానికీ దారి కనిపిస్తుంది. లేకపోతే, షరా మామూలే.!

భోగాది వేంకట రాయుడు