తెలంగాణలో ప్రతిదీ రాజకీయమే. చివరికి జాతిపిత మహాత్మాగాంధీజీ హత్యను కూడా వదల్లేదు. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఇదే రోజును తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు వైభవంగా ప్రారంభించారు. మరోవైపు విమోచన దినాన్ని నిర్వహించేందుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం గమనార్హం.
మహాత్మాగాంధీజీ హత్య వెనుక బీజేపీ పాత్ర ఉందనే అనుమానాన్ని మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు వెల్లడించడం సంచలనం రేకెత్తిస్తోంది. పాలకుర్తిలో ఎర్రబల్లి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం, అలాగే స్వాతంత్ర్య సమరంలో బీజేపీ పాత్ర లేదని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ విమోచనం అంటూ యాగీ చేస్తున్నారని ఎర్రబల్లి విమర్శించారు.
నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ పాలకుర్తి అని అన్నారు. తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం సెప్టెంబర్ 17న వచ్చిందని, అందుకే జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నామన్నారు.
గాంధీజీని హత్య చేసిన గాడ్సేను బీజేపీ నేతలు పొగుడుతున్న సంగతి తెలిసిందే. గాంధీజీని చంపిన గాడ్సే దేశ భక్తుడని బీజేపీ నేతలు పలు సందర్భాల్లో నిర్భయంగా ప్రకటించారు. దీంతో బీజేపీ అంటే గాంధీజీకి వ్యతిరేక పార్టీగా ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ కోణంలోనే ఎర్రబల్లి దయాకర్రావు విమర్శలను కూడా చూడాల్సి వుంది.
గాంధీజీ అంటే దేశానికి గొప్ప గౌరవం ఉంది. అలాంటి గాంధీజీని వ్యతిరేకించే పార్టీగా బీజేపీని చిత్రీకరించడం వెనుక టీఆర్ఎస్ వ్యూహం ఏంటో అర్థం చేసుకోవచ్చు.