విశాఖను పరిపాలన రాజధాని చేయాలనేది జగన్ ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు బిల్లులు కూడా రూపొందించి చట్టసభ ఆమోదించింది. మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల్లో లోపాలున్నాయని, సరిదిద్ది మళ్లీ అసెంబ్లీలో ఆమోదించుకుని వస్తామంటూ వాటిని వెనక్కి తీసుకుంది. అయితే అప్పటికే మూడు రాజధానులపై విచారణ సాగుతోంది.
ప్రభుత్వ అభిప్రాయాల్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకున్న తర్వాత విచారణ ఏంటని ప్రభుత్వం ప్రశ్నించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో అమరావతిలోనే ఏకైక రాజధాని కొనసాగించాలంటూ కొందరు అరసవెల్లి వరకు పాదయాత్ర మొదలు పెట్టారు. ఈ పాదయాత్రపై అధికార నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలి రోజు అభివృద్ధి వికేంద్రీకరణపై స్వల్ప కాల చర్చ కూడా జరిగింది. మూడు రాజధానుల ఆవశ్యకతను పలువురు సభ్యులు సభలో వివరించారు. అయితే సభలో మళ్లీ రాజధానుల బిల్లులు ఆమోదిస్తారని అందరూ భావించారు. ఆ పని చేయకుండా వ్యూహాత్మకంగా చర్చ వరకే ప్రభుత్వం పరిమితమైంది. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి పరిపాలన ఫలాన సమయం నుంచి చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్య చేశారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి పాలన వుంటుందని ఆయన తేల్చి చెప్పారు. విశాఖలో రాజధాని కోసం సెంట్ ప్రైవేట్ భూమి కూడా తీసుకోలేదన్నారు. మంత్రి కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ లేదా జూలై నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తారని తేల్చి చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యాయస్థానంలో కేసులు, ఇతరత్రా అడ్డంకులను ఎలా అధిగమిస్తారో అనే చర్చకు తెరలేచింది.