తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ఉన్నారని బీజేపీ నేతలు కొంత కాలంగా బలమైన విమర్శలు చేస్తున్నారు. కవితపై సీబీఐ విచారణ చేస్తోందని, త్వరలో నిజానిజాలు వెలుగు చూస్తాయని బీజేపీ నేతలు అంటున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఢీకొట్టడం, అలాగే బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తానని తెలంగాణ సీఎం కొన్ని నెలలుగా హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేసే దిశగా కేసీఆర్ సీరియస్‌గా పావులు కదుపుతున్నారు. దీంతో కేసీఆర్‌ను బీజేపీ టార్గెట్ చేసింది. తాడోపేడో తేల్చుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. ఏ చిన్న అవకాశం దొరికినా సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల్ని కేసుల్లో ఇరికించాలని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ కాచుకుని వుంది.
సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం బయటికొచ్చింది. కవిత భాగస్వామ్యం ఉందని బీజేపీ గట్టిగా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కవిత అకౌంటెంట్ ఇంట్లో ఇవాళ ఈడీ సోదాలు నిర్వహించింది. అలాగే కవితకు నోటీసులు పంపినట్టు సమాచారం. కోవిడ్‌తో కవిత క్వారంటైన్‌లో వుంటున్నారు. దీంతో ఆమె సంబంధీకులకు ఈడీ నోటీసులు అందజేసింది.
కేసీఆర్‌ను దెబ్బతీయడానికి మరో రూట్‌లో బీజేపీ నరుక్కొస్తోంది. కవితకు ఈడీ నోటీసులతో టీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుంది. నేరుగా కేసీఆర్‌ను కాకుండా, ముందుగా ఆయనకు అత్యంత సన్నిహితుల పని పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఏ విధంగా దారి తీస్తాయో చూడాలి.