బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి టెంపుల్ టౌన్ కాళహస్తికి చాలా లోటు. తిరుపతిలో జర్నలిస్టుగా చాలా కాలం పని చేయడంతో బొజ్జలతో నాకు కొంచెం పరిచయం. ఆయన ముక్కుసూటి మనిషి. విలేకరులతో చనువుగా వుండడు. అలాగని దూరం పెట్టడు.
ఎంత మేరకో అంతే. మంత్రిగా వున్నప్పుడు జర్నలిస్టు సభలకి అతిథిగా వచ్చేవాడు. జర్నలిస్టులకి ఏవైనా సమస్యలుంటే సిన్సియర్‌గా తీర్చే ప్రయత్నం చేసేవాడు. మాటల మనిషి కాదు.
1989లో మొదటిసారి గెలిచాడు. ఆయన తండ్రి ఎమ్మెల్యేగా చేస్తే, మామ మంత్రిగా చేశాడు. 94లో గెలిచిన ఆయన చంద్రబాబు వైపు వెళ్లాడు. వైశ్రాయ్ హోటల్ అధినేతతో బొజ్జలకి సమీప బంధుత్వం ఉంది. 99లో వరుసగా బొజ్జల గెలిచాడు. కాంగ్రెస్‌కి కాళహస్తిలో సరైన అభ్యర్థి లేకపోవడమే కారణమని గుర్తించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యూహం మార్చారు.
బొజ్జల శిష్యుడు, రాజకీయాల్లో ప్రధాన అనుచరుడైన ఎస్సీవీ నాయుడిని కాంగ్రెస్‌లోకి తీసుకుని టికెట్ ఇచ్చారు. బొజ్జల మొదటిసారి ఓడిపోయారు. తర్వాత 2009, 14లో కూడా గెలిచారు. 2019లో ఆయన కొడుకు సుధీర్ నిలబడి ఓడిపోయాడు.
రాజకీయాల్లో హుందాతనంగా ఉండే బొజ్జల శ్రీకాళహస్తి అభివృద్ధికి కృషి చేశాడు. ఎప్పుడూ కూడా గూండా రాజకీయం చేసిన వ్యక్తి కాదు. అలిపిరి బాంబు బ్లాస్ట్‌లో గాయపడిన ఆయన, ఆ తర్వాత మరో షాక్‌కు గురయ్యాడు. అనంతపురంలో పార్టీ సమన్వయకర్తగా ఆయన హాజరైన సమయంలోనే పరిటాల హత్య జరిగింది. ఈ రెండు సంఘటనలు తనను బాగా బాధించాయని సన్నిహితులతో చెప్పుకునే వాడు.
శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరులో నివాసం ఉండేవాడు. అదే ఊళ్లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కూడా ఉండేవాడు. బొజ్జలకు వ్యతిరేకంగా వార్తలు వచ్చినా కూడా విలేకరిని పల్లెత్తు మాట అనేవాడు కాదు. నేటి తరం నాయకుల్ని చూస్తే ఆయన ఒక గౌరవ తరానికి చెందిన వ్యక్తి.
జీఆర్ మహర్షి