విశాఖ సహజసిద్ధంగా ఎదిగిన నగరం. ఒక చిన్న పల్లెకారు ప్రాంతం నుంచి నేడు ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మహా నగరంగా విస్తరించింది. అసలు విభజన తరువాత ఏపీకి విశాఖ రాజధాని కావాల్సింది. కానీ విశాఖను పక్కన పెట్టేశారు. వైసీపీ విశాఖను పాలనా రాజధాని చేస్తానూ అంటే వద్దు అని టీడీపీ నేతలు అంటున్నారు.
ఏకంగా విశాఖ నడిబొడ్డు మీదనే టీడీపీ అధినేత చంద్రబాబు నిలబడి విశాఖకు రాజధాని ఎందుకు, అభివృద్ధి చాలదా అని గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీని మీద వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే బాబుతో ఒక లెక్కన చెడుగుడు ఆడుకున్నారు. చంద్రబాబుకు తామే బంపర్ ఆఫర్ ఇస్తున్నామని, అమరావతి రాజధానిగా ఎందుకు అక్కడ అభివృద్ధి చేస్తామంటే బాబు ఒప్పుకుంటారా అని నిలదీశారు.
బాబు ఆయన బినామీల కోసం అమరావతి రాజధాని కోసం అమాయకులు, పేదలు, బడుగులు అయిన ఉత్తరాంధ్రులు ఎందుకు త్యాగాలు చేయాలి అని గుడివాడ ప్రశ్నించారు. తప్పకుండా విశాఖ రాజధాని ఏదో రోజున అయి తీరుతుంది బాబూ అలానే చూస్తూనే ఉండు అంటూ గుడివాడ ప్రకటించారు.
విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అయితే విశాఖ మీద ఎందుకు అంత ద్వేషం పెట్టుకున్నావ్ బాబూ అని కాస్తా గట్టిగానే నిలదీశారు. విశాఖకు నాడు పెట్టుబడులు పెడతామని ఎందరో పారిశ్రామికవేత్తలు వస్తే వారిని అమరావతిలో పెట్టమని చెప్పిన చరిత్ర బాబుది అని ఆయన విమర్శించారు.
విశాఖ రాజధానిగా వద్దు అన్నదే బాబు కచ్చితమైన అభిప్రాయం అయితే టీడీపీకి విశాఖలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి అదే నినాదం మీద గెలిచి చూపించాలని ఆయన సవాల్ చేశారు. మొత్తానికి విశాఖ టూర్ లో బాబు విశాఖ మీద విషం కక్కి వెళ్ళారని వైసీపీ నేతలతో పాటు మేధావులు కూడా మండిపడుతున్నారు.