ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మొదటి బేరం తనతోనే ఆడిందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఓటు వేస్తే రూ.10 కోట్లు ఇస్తామని టీడీపీ ఆఫర్ చేసిందని రాపాక చేసిన ఆరోపణలపై టీడీపీ తీవ్రంగా స్పందిం చింది. టీడీపీ నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాపాకను కొనాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు.
రూ.10 కోట్లు కాదు, రూ.10 వేలు కూడా రాపాక వరప్రసాద్‌కు ఎక్కువే అని ఆయన వెటకరించారు. రూ.10 కోట్లు పెట్టి కొనడానికి అంత సుందరంగా వున్నావా? అని దెప్పి పొడిచారు. రాపాక వరప్రసాద్ అల్రెడీ వైసీపీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యే అని బొండా ఉమా ఆరోపించారు.
రాపాక అనే ఎమ్మెల్యే వైసీపీ ఆస్తి అని అన్నారు. 2019లో టీడీపీ తరపున 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇంకా ఒక ఓటు ఎక్కువే తమకు ఉందన్నారు.
అలాంటప్పుడు రాపాకతో తాము బేరాలు ఆడాల్సిన అవసరం ఏంటని ఆయన నిలదీశారు. ఇది తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ అని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి ఆడుతున్న జగన్నాటకంలో రాపాక వరప్రసాద్ ఆరోపణలని ఆయన అన్నారు. రాపాక ఆరోపణలను ఖండిస్తున్నట్టు బొండా ఉమా తెలిపారు. నలుగురైదుగురు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వస్తే తామేమైనా ముఖ్యమంత్రి అవుతామా? అని ఆయన ప్రశ్నించారు.