ఈ రోజుల్లో రాజకీయాలంటే పార్టీ ఫిరాయింపులే. నాయకులకు కుదురు లేదు. ఏ పార్టీలో దూరితే లాభం కలుగుతుందో ఎప్పుటికప్పుడు లెక్కలు వేసుకుంటారు. సిద్ధాంతాల గురించి, కమిట్ మెంట్ గురించి, విధేయత గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక పార్టీ మరో పార్టీని దెబ్బ కొట్టాలంటే కావలసింది విధానాలు కాదు. ఫిరాయింపులే. ఇక ఏ ఎన్నికలొచ్చినా నాయకుల ఫిరాయింపుల గురించి చెప్పుకోనక్కరలేదు. ఫిరాయింపుల విషయంలో పార్టీల అధినేతలకు చాలా పెద్ద మనసు ఉంటుంది. వేరే పార్టీలోకి వెళ్లి బండబూతులు తిట్టినా సరే మళ్ళీ వస్తే ఆనందంగా చేర్చుకుంటారు. అలా చేయకపోతే రాజకీయ మనుగడ ఉండదు. మునుగోడు ఉప ఎన్నిక పూర్తిగా పార్టీ ఫిరాయింపులమయం.
టీఆర్ఎస్ నాయకులు బీజేపీపీలోకి వెళ్లినందుకు, బీజేపీ నాయకులు టీఆర్ఎస్ లోకి వచ్చినందుకు భారీగానే ముట్టజెప్పి ఉంటారు. మునుగోడు నియోజకవర్గంలో నాయకులు ఏపూట ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల బీజేపీ, కాంగ్రెస్‌లో చేరిన పలువురు మండల, గ్రామ స్థాయి నాయకులను మంత్రి జగదీశ్‌రెడ్డి మళ్లీ పార్టీలోకి చేర్చుకున్నారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యతలతో పాటు.. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు, శాసనమండలి ఎన్నికల్లో పదవులు, టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలోకి ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ లో బీసీలు, గతంలో బయటకు వెళ్లిన నేతల చేరికలు ఊపందుకోవడంతో.. మరికొందరు నాయకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
రాష్ట్రస్థాయిలో మరికొందరు నేతలు గులాబీ పార్టీలో చేరబోతున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో ఆపరేషన్ ఆకర్ష్‌పై ప్రత్యేక కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. మునుగోడు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ జోరు పెంచి ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరం చేసింది. ఘర్ వాపసీ అంటూ గతంలో పార్టీని వీడిన నేతలను ఆహ్వానించి కండువా కప్పేస్తోంది. ఓ వైపు జాతీయ రాజకీయాలు, మరోవైపు మునుగోడు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది.
నల్లాల ఓదెలు దంపతులను పార్టీలోకి ఆహ్వానించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల గులాబీ కండువా కప్పారు. చేరికల పట్ల ఆచితూచి వ్యవహరించిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో వేగం పెంచింది. టీఆర్ఎస్ లో బీసీలకు అవమానం జరుగుతోందని బూర నర్సయ్య వ్యాఖ్యలను తిప్పికొట్టేలా వ్యూహాలతో దూకుడు పెంచింది. బీసీ నాయకులు టీఆర్ఎస్ వైపే ఉన్నారనే సంకేతం ఇచ్చేలా.. మొదట వారిపైనే దృష్టి పెట్టింది. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించిన పల్లె రవికుమార్ గౌడ్ దంపతులను పార్టీలో చేర్చుకున్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, బీజేపీలో ఉన్న దాసోజు శ్రవణ్‌కు ఒకేరోజు ఒకే వేదికపై గులాబీ కండువా కప్పి మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ ఉద్యమ సమయంలో తెరాసలో ఉండి కీలక పాత్ర పోషించిన నాయకులే. ఓ విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ వ్యూహంలో బీజేపీ చిక్కుకుందనే చెప్పొచ్చు. రాష్ట్రంలో బీసీ సామాజికవర్గం అజెండాతో బీజేపీ ముందుకుపోతోంది. ఇదే సామాజికవర్గానికి చెందిన నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుని కమలం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వరుసగా బీజేపీకి ఆ పార్టీ నేతలు గుడ్‌బై చెబుతున్నారు. దీంతో తెలంగాణ బీజేపీలో కలవరం మొదలైంది. జితేందర్ రెడ్డి, విఠల్, ఏనుగు రవీందర్ రెడ్డిలు బీజేపీని వీడుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఆ నేతలు ఖండించారు.
మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌లకు మంత్రి కేటీఆర్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. దిద్దుబాటు చర్యలకు ఆ పార్టీ అధిష్టానం దిగింది. పార్టీని వీడొద్దంటూ నేతలను అధిష్టానం బుజ్జగిస్తోంది. ఉప ఎన్నిక ముగిసేలోగా ఇంకెన్ని ఫిరాయింపులు జరుగుతాయో చెప్పలేం.