ప్రభుత్వం రూల్స్ పాటిస్తే పరిస్థితి ఎట్లా వుంటుందో అమరావతి పాదయాత్ర నిర్వాహకులు ఇప్పుడు అర్థమై వుంటుంది. ఇంతకాలం చూసీచూడనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తూ వచ్చింది. అందుకే మొదటి దశ పాదయాత్రను తిరుపతి వరకూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకెళ్లారు. అదేదో తమ ఉద్యమానికి విజయంగా వారు గొప్పలు చెప్పుకున్నారు.
హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అవసరం లేకుండానే రెండో దశ పాదయాత్రను ప్రారంభించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే, అదే ఉత్తరాంధ్రకు మీకు వద్దే వద్దంటూ పాదయాత్ర చేపట్టడంపై విమర్శలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. తమ ప్రాంతంపైకి దండయాత్రగా వస్తే… చూస్తూ ఊరుకునేది లేదని ఉత్తరాంధ్ర సమాజం హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో 41వ రోజుకు పాదయాత్ర చేసుకునే సరికి సహజంగానే అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో మరోసారి పాదయాత్ర నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. గుడివాడలోనూ, ఇతరత్రా పాదయాత్ర చేస్తున్న వారు తొడలు కొడుతూ, కవ్వింపు చర్యలకు పాల్పడడంపై ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో న్యాయస్థానం మరోసారి షరతులు విధించింది.
పాదయాత్రలో 600 మందికి మించి ఉండకూడదని, నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సంఘీభావం తెలిపే వారు రోడ్డు పక్కన నిలవాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కఠినంగా అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర నిర్వాహకులు గిలగిల కొట్టుకోవాల్సి వచ్చింది. చివరికి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం వద్ద అమరావతి యాత్రను నిలపాల్సి వచ్చింది.
లెక్క పెట్టి మరీ 600 మంది గుర్తింపు కార్డులు అడగడంతో పాదయాత్ర నిర్వాహకులు నోరెళ్లబెట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. బ్లాక్‌మెయిల్‌తో ఎప్పట్లా పాదయాత్రను కొనసాగించాలనే ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఆశయం కోసం పనిచేస్తే అడ్డంకులు ఎదురయ్యే అవకాశం వుండేది కాదు. కేవలం రెచ్చగొట్టడానికే అన్నట్టు అరసవిల్లికి పాదయాత్రగా బయల్దేరిన వారు… నాలుగు రోజుల తర్వాత మళ్లీ వస్తామని ప్రకటించడం గమనార్హం.