ఏపీలో పాత మంత్రుల్లో కొంతమందికి అవే శాఖలు ఖరారయ్యాయి. కొంతమందికి కొత్త శాఖలొచ్చాయి. అయితే బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్.. ఇద్దరికీ శాఖలు పరస్పరం మారాయి. మరి బొత్స శాఖలో సురేష్ రాణిస్తారా, సురేష్ శాఖను బొత్స మరింత సమర్థంగా నిర్వహిస్తారా.. తేలాల్సి ఉంది.
జగన్ తొలి కేబినెట్ లో బొత్స సత్యనారాయణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు మంత్రిగా పనిచేశారు. అదే టీమ్ లో ఆదిమూలపు సురేష్ విద్యా శాఖను నిర్వహించారు. విద్యాశాఖలో జగన్ హయాంలో సమూల మార్పులు జరిగాయి. నాడు-నేడు, ఇంగ్లిష్ మీడియం, అమ్మఒడి, విద్యా దీవెన వంటి పథకాలతో విద్యాశాఖలో కాస్త పనిభారం ఉంది. పైగా ప్రతిష్టాత్మకం కూడా.
ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా.. విద్యాశాఖ విషయంలో జగన్-ఆదిమూలపు సురేష్ కాంబినేషన్ బాగానే వర్కవుట్ అయింది. అయితే జగన్ మలి కేబినెట్ లో విద్యాశాఖ బొత్స సత్యనారాయణ చేతుల్లోకి వెళ్లింది.
నాడు-నేడు కొనసాగింపు సహా ఇతర కార్యక్రమాలను నిర్విఘ్నంగా అమలు చేయడంలో బొత్స ఎలాంటి పేరు తెచ్చుకుంటారో చూడాలి. ఇప్పటికే విప్లవాత్మకమైన మార్పులు మొదలయ్యాయి. వాటిని కొనసాగించడంలో బొత్స నేర్పు ఏంటో ఇప్పుడు బయటపడుతుంది.
ఇక ఆదిమూలపు సురేష్ కొత్తగా పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఈ శాఖ చూసిన బొత్స సత్యనారాయణకు రాజధాని లేకపోవడంతో తన మార్కు చూపించుకునే అవకాశం లేకపోయింది.
కనీసం మూడు రాజధానుల విషయం ఖరారైనా అక్కడ అభివృద్ధి చేసే అవకాశం ఉండేది. కానీ అటు ఇటు కాకుండా రాజధాని డైలమాలో పడటంతో ఆ శాఖ ప్రధాన ఆశయం కాస్త వెనక్కు వెళ్లింది. ఇక మిగతా విషయాల్లో ఆస్తి పన్ను పెంపు, చెత్త సేకరణకు పన్ను విధింపు వంటి నిర్ణయాలన్నీ బొత్స హయాంలో పట్టాలెక్కాయి. వాటి ఫలితం ఇప్పుడు ఆదిమూలపు సురేష్ పై పడుతోంది.
పట్టణాలు, నగరాలను చెత్తరహితంగా తీర్చిదిద్దడమే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన క్లీన్ ఆంధ్రప్రదేశ్ కలను సాకారం చేస్తానంటున్నారు.
విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్రవేసిన సురేష్, ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా తన గుర్తింపు చాటుకుంటానంటున్నారు. మరి పరస్పరం శాఖలు మార్చుకున్న ఈ ఇద్దరు మంత్రులు ఎవరెవరు ఎంత పనిమంతులుగా తమ ప్రభావం చూపిస్తారో వేచి చూడాలి.