కొత్త ప్రభుత్వంలో వారి వాటా సింహ భాగం!

ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు. సర్వేలు జోస్యాలు చూస్తే అలాగే ఉన్నాయి. ఎవరికి వారు సొంత సర్వేలను వదులుతూ తాము నమ్ముతూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చైతన్యం కలిగిన జనాలు…

ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు. సర్వేలు జోస్యాలు చూస్తే అలాగే ఉన్నాయి. ఎవరికి వారు సొంత సర్వేలను వదులుతూ తాము నమ్ముతూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చైతన్యం కలిగిన జనాలు మాత్రం వాటిని బుర్రలకు ఎక్కించుకునే ప్రయత్నం చేయడం లేదు. దాంతో ఎవరో ఒకరు అధికారంలోకి రావడం ఖాయం అన్నది జనాలలో ఉన్న భావన.

ఎవరు అధికారంలోకి వచ్చినా మంత్రి పదవులల్లో సింహ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చి తీరాలని బీఎస్పీ డిమాండ్ చేస్తోంది. విశాఖ పర్యటనకు వచ్చిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జె పూర్ణచంద్రరావు సీఎం తో కలుపుకుని ఏపీ మంత్రివర్గంలో 26 పదవులు ఉంటాయని అందులో 12 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలని అయిదు పదవులు ఎస్సీలకు, అలాగే రెండు ఎస్టీలు, మైనారిటీలకు రెండు పదవులు ఇవ్వాలని కోరారు.

ఆ మంత్రి పదవులు కూడా కీలక శాఖలు ఇవ్వాలి తప్ప ఏవో ఇచ్చామంటే కుదరదు అన్నారు. సీఎస్ డీజీపీ లాంటి పోస్టులు బహుజనులకు ఇస్తే ఏమి పోయింది అని ఆయన ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల్లో రెండు కులాలు, రెండు కుటుంబాలదే పెత్తనం అయిందని ఈ ఇద్దరూ తప్ప మరో దిక్కు లేదా అని ఆయన నిలదీశారు.

సీఎం పదవిని చేపట్టని ఎన్నో కులాలు ఉన్నాయని వారికి ఆ అత్యున్నత పదవి కట్టబెడితే తప్పేంటి అని ఆయన అంటున్నారు. రాష్ట్రంలో ప్రజలు కూడా ఇంకెవరూ లేనట్లుగా ఆ రెండు పార్టీలు రెండు కులాల వెంట పడడం మానుకోవాలని ఆయన హితబోధ చేశారు. 

ఈసారి ఎన్నికలు ప్రజా సమస్యల మీద జరగలేదని ఈ ఇద్దరిలో ఎవరు సీఎం కావాలన్న దాని మీద జరిగాయని బీఎస్పీ నేత మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి మేలు చేసేది కానే కాదు అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి ఎవరు సీఎం అయినా తమ కులాభిమానం వీడి కీలక పదవులు బహుజనులకు కట్టబెట్టి వారికి సామాజిక న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.