విజయవాడలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంట్లో కాపు నేతల సమావేశం హాట్ టాపిక్‌గా మారింది. వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన గంటా శ్రీనివాసరావు, బొండా ఉమా, కన్నా లక్ష్మినారాయణ తదితరులు సమావేశం కావడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్లంతా పవన్‌కల్యాణ్‌కు మద్దతు తెలుపుతున్నారనే ప్రచారం ఎక్కువగా సాగింది. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఆ సామాజిక వర్గానికి చెందిన నేతే.
ఈ నేపథ్యంలో కాపు నేతలు ఉలిక్కి పడ్డారు. అసలు రాజకీయాలే మాట్లాడలేదని గంటా శ్రీనివాసరావు, బొండా ఉమా చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె వివాహానికి హాజరైన సందర్భంలో అనుకోకుండా భేటీ అయినట్టు కాపు నేతలు చెప్పడం విశేషం. తమ మధ్య రాజకీయ ప్రస్తావనే రాలేదని గంటా చెప్పడం అతి పెద్ద జోక్‌గా నెటిజన్లు వెటకరిస్తున్నారు.
పార్టీ మార్పుపై మరోసారి గంటా వివరణ ఇచ్చారు. పార్టీ మారే ఆలోచన వుంటే… మీడియాకు చెప్పే చేస్తానన్నారు. కాపు నేతల మీటింగ్ వెనుక ప్రత్యేక ఎజెండా ఏదీ లేదన్నారు. బొండా ఉమా మాట్లాడుతూ తమ సమావేశాన్ని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు. కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత యోగ క్షేమాల గురించి మాత్రమే సమావేశంలో మాట్లాడుకున్నట్టు ఆయన చెప్పారు.
కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడం కేవలం వ్యక్తిగత సంబంధాల వల్లే జరిగిందన్నారు. కాపు నేతలుగా బలమైన ముద్ర పడితే ఇతర సామాజిక వర్గాల వ్యతిరేకత మూటకట్టుకోవాల్సి వస్తుందనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. కాపు నేతల భేటీని పవన్‌తో ముడి పెట్టడం వల్ల ప్రజారాజ్యాన్ని దెబ్బ తీసినట్టే జనసేనపై కుల ముద్ర వేసి రాజకీయంగా చంపేస్తారనే ఆందోళన వారిలో కనిపిస్తోంది.
ఎన్నికలు సమీపించే కొద్ది జనసేనపై మరింత బలంగా కుల ముద్ర వేసే అవకాశాలున్నాయి. ఇందుకు కాపు నాయకులు శక్తి వంచన లేకుండా తోడ్పడుతారనడంలో సందేహం లేదు. ఈ నెల 26న విశాఖలో జరిగే కాపునాడు భేటీ ఇందుకు శ్రీకారం చుడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడైతే జనసేన కేవలం కాపుల పార్టీగా ముద్ర పడుతుందో, అప్పటి నుంచే దాని పతనం ప్రారంభమవుతుంది. కావున జనసేనను కాపాడుకునేందుకు కాపులు ఏం చేస్తారనేది వారి రాజకీయ పంథాపై ఆధారపడి వుంటుంది.