ప్రధాని మోదీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అపాయింట్మెంట్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ నడకపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి… ఉప ఎన్నిక బరిలో నిలిచి సెమీ ఫైనల్ మ్యాచ్ను తలపింపజేశారు. ప్రస్తుతం రాజగోపాల్రెడ్డి అన్న వెంకటరెడ్డి రాజకీయంపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఇటీవల 18 మంది నేతలతో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటైంది. అలాగే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అలాగే పలువురు జిల్లా అధ్యక్షులతో పాటు 24 మంది టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, 84 మంది జనరల్ సెక్రటరీలను పార్టీ నియమించింది. ఈ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు లేదు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షాక్ ఇచ్చినట్టైంది.
ఈ నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేను కోమటిరెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో జాతీయ స్థాయిలో వెంకటరెడ్డికి కీలక పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. ఒకవైపు ఈ ప్రచారం సాగుతుండగా, మరోవైపు ఇవాళ ప్రధానితో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అపాయింట్మెంట్ ఖరారైందనే వార్తలొచ్చాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధానితో భేటీ కావాలని పీఎంవో నుంచి సమాచారం అందింది.
కాలుష్యం కారణంగా నల్గొండలో మూసీ పరివాహక ప్రాంతాల ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలపై పీఎంతో చర్చించేందుకు వెంకటరెడ్డి వెళ్లనున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో జరిగిన సమావేశం అసంతృప్తిని మిగిల్చిందని, అందుకే వెంకటరెడ్డి బీజేపీలో చేరేందుకు నాటకాలు ఆడుతున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తమ్ముడి మాదిరిగానే అన్న కూడా త్వరలో బీజేపీ కండువా కప్పు కుంటారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.