గుట్టుగా ఉక్కు లెక్కలు కట్టేస్తున్నారు

విశాఖ స్టీల్ ప్లాంట్ విలువ ఎంత అంటే అది మాటలతో చెప్పడం కష్టం. ప్లాంటుకి ఇచ్చిన భూమే వేల ఎకరాల్లో ఉంది. అందులో వాడుకున్నది సగం కూడా లేదు. మిగిలిన భూమిని లెక్క వేసుకున్నా…

విశాఖ స్టీల్ ప్లాంట్ విలువ ఎంత అంటే అది మాటలతో చెప్పడం కష్టం. ప్లాంటుకి ఇచ్చిన భూమే వేల ఎకరాల్లో ఉంది. అందులో వాడుకున్నది సగం కూడా లేదు. మిగిలిన భూమిని లెక్క వేసుకున్నా సులువుగా మూడు నుంచి నాలుగు లక్షల కోట్లు ఉంటుంది.

స్టీల్ ప్లాంట్ భవనాలు అక్కడ కర్మాగారం సామగ్రి అత్యాధునిక ఎక్విప్మెంట్ అన్నీ కలిపి చూసినా మరో లక్ష కోట్లు సులువుగా వేసుకోవచ్చు. వెరసి అయిదు లక్షల కోట్ల రూపాయల ఆస్తిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని అంతా చెబుతున్నారు. అయితే కేంద్రం మాత్రం చాలా గుట్టుగా స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన విలువను కడుతోంది అని ఉద్యమ సంఘాలు మండిపడుతున్నాయి.

స్టీల్ ప్లాంట్ వస్తుందంటే భూములు ఇచ్చారు, విస్తరణ కోసం వాటిని దశాబ్దాలుగా అట్టే బెట్టుకున్నారు. ఇపుడు ప్లాంట్ తో పాటు ఉన్న భూమిని అంతా ఎవరికో దాసోహం చేస్తే మేము అసలు ఒప్పుకోమని అంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో స్టీల్ ప్లాంట్ కొనసాగిస్తే ఆ భూములు వాడుకోవచ్చు అని కూడా ఉద్యమకారులు సూచిస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో అయినా కలపాలి. లేకపోతే దాన్ని అలాగైనా ఉంచాలి తప్ప ప్లాంట్ ని చిల్లరగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి మొత్తం భూములను వారికి దోచిపెడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో వాల్యుయేషన్‌ను కూడా రహస్యంగా పూర్తిచేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నిందని ఉక్కు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

వ్యూహాత్మక అమ్మకమని నమ్మకంగా చెబుతూ నూరు శాతం వాటానే విక్రయించానికి చూస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఒక వైపు ప్లాంట్ అమ్మకం పనులను ముమ్మరం చేస్తూ రెండవ వైపు స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని కూడా చీల్చే కుట్రకు కేంద్రం తెర తీసిందని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. విశాఖలో మకాం పెట్టిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ చీలిక తేవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారని నాయకులు విమర్శిస్తున్నారు.

ఉక్కు మంత్రిని కలిసి మెమోరాండాలు ఇవ్వడం, పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తడం ఇవన్నీ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంకోసమే ఒక కుట్రతో బీజేపీ ఎంపీ చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు స్టీల్ ప్లాంట్ కి మంచి చేస్తున్నట్లుగా పైకి చెబుతూ లోపల అమ్మకం సజావుగా సాగడానికే ఎంపీ తన ప్రయత్నాలు చేస్తున్నారు అని వారు అంటున్నారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటికే కేంద్ర బిజెపి సర్కారు టాటా స్టీల్‌, జెఎస్‌డబ్యు, అదానీ, పోస్కో గ్రూపులతో ప్రీ బిడ్డింగ్‌ సంప్రదింపులు జరపడమే కాదు రోడ్‌షోలు నిర్వహించినట్లు తెలుస్తున్నదని సిపిఎం కార్యదర్శిసభ్యులు, 78వవార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, స్టీల్‌ప్లాంట్‌ యూనియన్‌ నాయకులు కె.ఎం.శ్రీనివాస్‌ మండిపడ్డారు. కేంద్ర స్టీల్‌ మంత్రి నిర్వహించే డాష్‌బోర్డు సమావేశాలలో స్టీల్ అమ్మకం మీద వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని వారు అంటున్నారు. దీన్ని తాము తప్పకుండా అడ్డుకుని తీరుతామని స్పష్టం చేస్తున్నారు.