దేశ, విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు వస్తుంటారు. విమానమార్గంలో వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనాన్ని మరింత చేరువ చేసేందుకు తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ అందుబాటులోకి వచ్చింది. టీటీడీ తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం, ఎయిర్పోర్ట్ డీజీఎం చంద్రకాంత్, టెర్మినల్ మేనేజర్ మణిదీప్, సివిల్ ఇంజినీర్ యూటీ రాథోడ్ గురువారం విమానాశ్రయంలో ప్రారంభించారు.
విమానాశ్రయంలో శ్రీవారి ట్రస్ట్ కరెంట్ బుకింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని గతంలో విమానాశ్రయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి టీటీడీ పాలక మండలి, ఉన్నతాధికారులకు విన్నవించారు. అది నేటికీ కార్యరూపం దాల్చింది. ఇక మీదట విమానాల్లో వచ్చే ప్రయాణికులు తిరుమల దర్శనానికి వెళ్లాలని అనుకుంటే తిరుపతి విమానాశ్రయంలోనే టికెట్ కొనుగోలు చేసే అవకాశం కలిగింది.
తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి కరెంట్ బుకింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం వుంది. శ్రీవాణి టికెట్ రూ.10,500. ఇక్కడ టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు తిరుపతి మాధవంలో అద్దె ప్రాతిపదికన రూమ్‌లు కేటాయిస్తారు.
ఇదిలా వుండగా తన విన్నపాన్ని మన్నించి విమానాశ్రయంలో శ్రీవాణి కరెంట్ బుకింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చొరవ చూపిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితర అధికారులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.