అధికారంతో పాటు బాబుకు మైండ్ కూడా పోయినట్టుంది. విజ్ఞతగల నాయకుడెవరైనా తన ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటాడు. తప్పుల్ని సరిదిద్దుకుని, మళ్లీ ప్రజల ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తాడు. అదేంటో గానీ, చంద్రబాబు మానసిక స్థితి అందుకు పూర్తి భిన్నం. తనను ఓడించి ప్రజలే తప్పు చేశారని అనేక సందర్భాల్లో తిట్టిపోశారు. తాను అద్భుతమైన పాలన సాగించానని, జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకున్నారనేది ఆయన భావన.
జగన్ అధికారంలోకి వచ్చిన మొదలు ….ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇవ్వడం చంద్రబాబుకే చెల్లింది. పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జగన్‌పై జనంలో వ్యతిరేకత వుందట. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కనీస పోటీ కూడా ఇవ్వలేదెందుకనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పరు. తాజాగా ఆన్‌లైన్‌లో నియోజకవర్గాల నేతలతో ఇదేం ఖర్మ కార్యక్రమంపై చంద్రబాబు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌కు ప్రభుత్వ వ్యతిరేక సెగ తగులుతోందని అన్నారు. జగన్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. దీంతో ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు. వచ్చే మే లేదా అక్టోబర్‌లో ఎన్నికలకు వెళ్లాలని జగన్ ఆలోచిస్తున్నట్టు చంద్రబాబు ముహూర్తం కూడా ఖరారు చేయడం గమనార్హం. ఇప్పటికీ 50 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్‌చార్జ్‌లు లేని పరిస్థితి. కొన్నిచోట్ల ఎవరూ దిక్కులేకపోవడంతో బలహీనమైన నాయకులకు బాధ్యతలు అప్పగించిన దయనీయ స్థితి.
ముందస్తు ఎన్నికలనో, జమిలీ ఎన్నికలనో సొంత పార్టీ నాయకులకు మాయ మాటలు చెబితే తప్ప, వారిని నిలుపుకోలేమనే చంద్రబాబు బాధ అర్థం చేసుకోదగ్గదే. ముందస్తు ఎన్నికల జపం చేయకపోతే… కనీసం మరో ఏడాదిన్నర వరకు నాయకుల్ని కాపాడుకోలేమని చంద్రబాబు భయపడుతున్నారు. కానీ పదేపదే నేడో, రేపో ఎన్నికలు వస్తాయన్నట్టు చంద్రబాబు తమను మభ్య పెట్టడంపై టీడీపీ నేతలు… ఇదేం ఖర్మరా బాబూ అంటున్నారు.
రాజకీయాలపై చైతన్యం పెరిగిన నేటి కాలంలో, కళ్లకు గంతలు కట్టాలంటూ కుదరని పని. ఒకవేళ అలాంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే… జనం చులకనగా చూస్తారు. అందుకే చంద్రబాబు పలుచనయ్యారనే మాట వినపడుతోంది.
Tdp adhikaram dhaham