కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ అన్న ప్రసాద్ యాదవ్ ఇంటిపై గత రాత్రి దాడి జరిగింది. ఈ విషయమై ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ సోదరుడి ఇంటిపై దాడి కావడంతో …నిందితులకు ఏమా ధైర్యం అనే వాదన వినిపిస్తోంది. బీసీ కోటా కింద రమేశ్ యాదవ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అప్పటి నుంచి ప్రొద్దుటూరులో అధికార పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది.
గతంలో రమేశ్ యాదవ్‌కు అగంతకులు ఫోన్ చేసి చంపుతామని బెదిరించారు. తనకు ప్రాణహాని వుందని, నిందితులెవరో పట్టుకోవాలని ప్రొద్దుటూరు పోలీసులకు రమేశ్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ఇంత వరకూ ఆ బెదిరింపు ఫోన్ కాల్ అంశమే తేల్చలేదు. దీన్నిబట్టి ఆ ఫోన్ కాల్ వెనుక బడా నేతలున్నారని అర్థం చేసుకోవచ్చని రమేశ్ యాదవ్ అప్పట్లో రమేశ్ అన్నారు.
రమేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రొద్దుటూరులో ప్లెక్సీలు కట్టారు. వాటిని రాత్రికి రాత్రే చింపేశారు. బ్యానర్లు కడుతున్న రమేశ్ అనుచరులపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. తాజాగా ఎమ్మెల్సీ సోదరుడు ప్రసాద్ యాదవ్ ఇంటిపై అర్ధరాత్రి కట్టెలు, కత్తులతో దాడికి పాల్పడడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఆ సమయంలో రమేశ్ అన్న ప్రసాద్ ఇంట్లోనే వున్నాడు. అయితే కుటుంబ సభ్యులెవరికీ ఏమీ కాలేదు. గత రాత్రి మద్యం మత్తులో కొందరు యువకులు ఎమ్మెల్సీ సోదరుడికి ఫోన్ చేసి తిట్టి మరీ ఇంటిపైకి వచ్చినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ సంగతి తెలియగానే ఎమ్మెల్సీ రమేశ్ అక్కడికి వెళ్లి పరామర్శించారు. ఈ ఘటనపై సీఐతో ఎమ్మెల్సీ మాట్లాడారు.