వివేకా హత్య కేసు అనేక రకాల మలుపులు తిరుగుతున్న సంగతి అందరూ గమనిస్తున్నదే. ఈ కేసులో ఇంకా చాలా చాలా అంశాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ 15న ఉదయం ఏం జరిగిందనే విషయంలో .. ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ తన ఊహకు అందిన అనేకానేక విషయాలను తన పత్రికలో వండి వార్చారు. అందులో చెప్పిన అనేకానేక ఊహలను పక్కన పెడితే.. ఒక్క విషయం మాత్రం ఇంటరెస్టింగ్ గా ఉంది.
వైఎస్ వివేకానందరెడ్డిని కీర్తించే ప్రయత్నంలో రాధాకృష్ణ రాసిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి..
‘‘ఈ దశలోనే అమెరికాలో నివసిస్తున్న డాక్టర్ సునీత దంపతులు స్వరాష్ర్టానికి తిరిగి వచ్చారు. కుటుంబంలో తాను ఒంటరిగా మిగిలిపోవడంతో చక్కటి జీవితాన్ని కూడా వదులుకొని కూతురు, అల్లుడు తనకోసం వచ్చేశారని ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో వివేకా చెప్పుకొన్నారు. కుమార్తె, అల్లుడికి ఆస్తులపై మమకారం లేదని కూడా వివరించారు. ఇప్పుడు అదే సునీత దంపతులపై ఆస్తుల కోసం హత్యకు కుట్ర చేశారని నిందలు వేస్తున్నారు.’’ అంటూ ఆర్కే రాసుకొచ్చారు.
అదే సమయంలో వివేకా హత్య అనేది ఆస్తుల కోసం జరిగిన హత్యగా దాని వెనుక ఆయన కూతురు సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి పాత్ర ఉన్నట్టుగా అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. సునీత పాత్ర అసలు ఉండడానికే అవకాశం లేదని, వారితో వివేకాకు చాలా ప్రేమపూర్వకమైన అనుబంధం ఉన్నదని చాటిచెప్పడానికి రాధాకృష్ణ ప్రయత్నించినట్టుగా ఈ కథనం కనిపిస్తోంది.
అల్లుడు, కూతురు తన కోసమే వచ్చినట్టుగా వివేకా చెప్పినట్టు రాశారు. ఆస్తులపై మమకారం లేదని వివరించినట్టుగా చెప్పారు. ఆర్కే ఇంటర్వ్యూలో ఈ విషయాలు కనిపించాలి. ఇలాంటి ఇంటర్వ్యూలో అసంబద్ధంగా ఆస్తుల ప్రస్తావన ఎందుకు వచ్చి ఉంటుందో అర్థం కాని సంగతి.
అయితే సాధారణంగా ఈ ఇంటర్వ్యూలను ఎడిటెడ్ వెర్షన్లను మాత్రమే ప్రసారం చేస్తారు. ఒకవేళ వివేకా అలాంటి మాటలు అన్నట్టుగా అందులో ఉండవచ్చు కూడా! కానీ వాస్తవంగా ఏ నేపథ్యంలో వివేకా అలాంటి మాటలు అన్నాడో ముందు వెనుక ఏ ప్రశ్నలు, ఏ జవాబులు వచ్చాయో.. ‘అన్ కట్’ వీడియో ఫుటేజీ చూడాలని సీబీఐ భావించవచ్చు. అది తేలాలంటే.. ఆంద్రజ్యోతి రాధాకృష్ణకు కూడా సీబీఐ నోటీసులు ఇచ్చి పిలిపిస్తుందని.. ఆ రోజు ఇంటర్వ్యూలో ఏం జరిగిందో మొత్తం చెప్పాల్సిందిగా, ఫుటేజీ చూపించాల్సిందిగా అడుగుతుందని కూడా కొందరు భావిస్తున్నారు.
మొత్తానికి రాధాకృష్ణ తన రాతల ద్వారా ఎవరినో కెలకాలని అనుకున్నట్టున్నాడు గానీ.. సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా? ఆయనకు కూడా సీబీఐ విచారణ తప్పదా అనే చర్చలు ప్రజల్లో నడుస్తున్నాయి.