పోలవరం విషయంలో ఢిల్లీ పెద్దల ముందు జాగ్రత్త!

పోలవరం అనేది పూర్తిగా జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతి రూపాయిని కేంద్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే విభజన తర్వాత గద్దెక్కిన చంద్రబాబు నాయుడు అత్యుత్సాహం కారణంగా నిధులు కేంద్రానివి..…

పోలవరం అనేది పూర్తిగా జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతి రూపాయిని కేంద్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే విభజన తర్వాత గద్దెక్కిన చంద్రబాబు నాయుడు అత్యుత్సాహం కారణంగా నిధులు కేంద్రానివి.. నిర్మాణ బాధ్యత రాష్ట్రానిది అయింది.

సమన్వయ లోపం, నిధులు సకాలంలో విడుదల కాకపోవడం, పనులు సజావుగా జరగకపోవడం లాంటి అనేక అరిష్టాలు పోలవరం ప్రాజెక్టును చుట్టుముట్టాయి. కేంద్రం పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. కాస్త ముందు వెనుక పోలవరానికి అవసరమైన నిధులు ప్రతిరూపాయి వాళ్లే ఇస్తున్నారు గాని.. పనులు పూర్తికాక చెడ్డపేరు కూడా వాళ్లే భరించాల్సి వస్తుంది. అందువల్ల ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో తయారైన కొత్త డిపిఆర్ ను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం.. పనుల పూర్తికి సంబంధించి ముందు జాగ్రత్తగా అనేక కండిషన్లు పెట్టినట్లుగా తెలుస్తోంది.

2027 లోపు పనులు పూర్తయితే మాత్రమే మిగిలిన నిధులు ఇస్తామంటూ కేంద్రం నిబంధన విధించింది. మొత్తం 30 వేల కోట్లకు పైగా విలువైన డిపిఆర్ ను ప్రస్తుతం ఆమోదించగా, నిధులు 12 వేల కోట్ల రూపాయల పైచిలుకు మాత్రమే. మిగిలిన నిధులు కూడా రాబట్టుకోవాలంటే వారు విధించిన నిర్దేశిత గడువులలోగా పనులను కచ్చితంగా పూర్తి చేసి తీరాలి.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకోవడం జరుగుతున్నదే తప్ప పనులు అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదనే అభిప్రాయం కేంద్రానికి కలిగినట్లుగా ఉంది. అందుకే ఇప్పుడు 12 వేల కోట్లను మంజూరు చేస్తూ.. దీనిని రెండు విడతలుగా ఇస్తామని.. 2026 మార్చి నాటికి తొలిదశలో నీళ్లు నిలబెట్టేలా పూర్తి చేయాలని ఆదేశించింది. 27 ప్రారంభానికెల్లా ఈ పనులన్నీ పూర్తయితే మాత్రమే తదుపరి నిధులు ఇస్తామంటూ షరతు కూడా విధించింది.

ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేందుకు డి పి ఆర్ ఓకే అయింది. ఈ ఎత్తుకు ప్రాజెక్టు నిర్మించడం వలన 110 టీఎంసీల నీళ్లు నిలబెట్టవచ్చు. పోలవరం పూర్తిస్థాయిలో అంటే 45.72 మీటర్ల స్థాయికి డ్యాం నిర్మాణం పూర్తయితే కనుక 194 టిఎంసిల నీళ్లు నిలబెట్టడం సాధ్యమవుతుంది. అయితే ఆమేరకు ఎత్తైన ప్రాజెక్టు నిర్మించాలంటే అదనంగా మరో 25 వేల కోట్ల రూపాయల అవసరమవుతాయని ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. ఈ పనులు పూర్తి అయిన తర్వాత అప్పటి అవసరాల కోసం రెండో డి పి ఆర్ ని సిద్ధం చేస్తామని దానిని కూడా ఆమోదించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ముందే కేంద్రానికి విన్నవించింది.

ఇప్పటికే చాలా వరకు నిర్మాణ పనులు పూర్తయి ఉన్న పోలవరం విషయంలో.. కేంద్రం విధించిన గడువులు ఏమాత్రం మీరకుండా.. రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పనులు పూర్తి చేయగలిగితే.. 45 మీటర్ల దాటిన పూర్తి ఎత్తు ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు అడిగే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు మాత్రం కేంద్రానికి థాంక్స్ చెబుతూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమర్థులైన అధికారులను ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం నియమించబోతున్నామని.. పనులు పరుగులు పెట్టిస్తామని అంటున్నారు.

జగన్ హయాంలో జరిగిన రివర్స్ టెండరింగ్ ను రద్దు చేయడం ద్వారా కొత్త కాంట్రాక్టర్ల చేతిలో పనులు పెట్టడానికి చంద్రబాబు ఆల్రెడీ రంగం సిద్ధం చేశారు. ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ కనీసం పనులైనా వేగంగా పూర్తి చేస్తే రాష్ట్రానికి ఆపరిమిత లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

5 Replies to “పోలవరం విషయంలో ఢిల్లీ పెద్దల ముందు జాగ్రత్త!”

Comments are closed.