నారా ఒంట్లో ఎంత భ‌య‌మంటే…!

భ‌య‌మంటే ఏంటో త‌మ బ్ల‌డ్‌లో లేద‌ని చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ ప‌దేప‌దే చెబుతుంటారు. ప్ర‌తి చిన్న విష‌యానికి భ‌య‌పడేవాళ్లే, త‌ర‌చూ త‌మ‌లో భ‌యం లేద‌ని చెబుతుంటార‌ని మానసిక శాస్త్ర‌వేత్త‌ల అభిప్రాయం. “ఏయ్ జ‌గ‌న్…

భ‌య‌మంటే ఏంటో త‌మ బ్ల‌డ్‌లో లేద‌ని చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ ప‌దేప‌దే చెబుతుంటారు. ప్ర‌తి చిన్న విష‌యానికి భ‌య‌పడేవాళ్లే, త‌ర‌చూ త‌మ‌లో భ‌యం లేద‌ని చెబుతుంటార‌ని మానసిక శాస్త్ర‌వేత్త‌ల అభిప్రాయం. “ఏయ్ జ‌గ‌న్ ఏం పీక్కుంటావో పీక్కో. న‌న్ను ట‌చ్ చేయ‌డం మీ నాన్న వ‌ల్లే కాలేదు. నా రాజ‌కీయ అనుభ‌వ‌మంత వ‌య‌సు లేని నీ వ‌ల్ల ఏమ‌వుతుంది” అని చంద్ర‌బాబు ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

తాను జైలు ఊచ‌లు లెక్కించాల్సిన రోజు ఒక‌టి వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. నాలుగేళ్ల‌కు పైగా ప‌రిపాల‌నా కాలం పూర్త‌య్యింద‌ని, ఇక జ‌గ‌న్ త‌న జోలికి రార‌ని చంద్ర‌బాబు కాస్త నిర్ల‌క్ష్యంగా ఉన్నార‌నేది వాస్త‌వం. త‌న‌ను అరెస్ట్ చేస్తార‌ని వాస‌న ప‌సిగ‌ట్టి వుంటే, ఆయ‌న వెంట‌నే ముంద‌స్తు బెయిల్ తెచ్చుకునేవారు. త‌న‌ను కూడా రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తార‌నే చంద్ర‌బాబు ఉత్తుత్తి కామెంట్స్ చేసి ప్ర‌జ‌ల నుంచి సానుభూతి పొందాల‌ని ప్ర‌య‌త్నించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా వుండ‌గా చంద్ర‌బాబు అరెస్ట్ వెనుక పెద్ద శ‌క్తులే ఉన్నాయ‌ని టీడీపీ అనుమానిస్తోంది. కేవ‌లం సీఎం జ‌గ‌న్ ఒక్క‌డి వ‌ల్లే ఇదంతా జ‌ర‌గలేద‌ని ఆ పార్టీ అనుకుంటోంది. కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం వ‌ల్లే చంద్ర‌బాబును జైలుకు పంపార‌ని టీడీపీ గ‌ట్టిగా విశ్వ‌సిస్తోంది. అయితే జ‌గ‌న్‌పై దూకుడుగా విమ‌ర్శ‌లు చేసిన‌ట్టుగా, బీజేపీపై నోరు పారేసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కేంద్ర ప్ర‌భుత్వంపై ఏవైనా విమ‌ర్శ‌లు చేస్తే మ‌రింత‌గా క‌ష్టాల్లో కూరుకుపోతామ‌ని చంద్ర‌బాబు, లోకేశ్‌తో పాటు టీడీపీ నేత‌లు భ‌యాందోళ‌న చెందుతున్నారు.

ప్రెస్‌మీట్‌లో లోకేశ్‌ను మీడియా ప్ర‌తినిధి ఓ ప్ర‌శ్న ఆయ‌న‌లోని భ‌యాన్ని బ‌య‌ట పెట్టింది. చంద్ర‌బాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉంద‌నే ఆరోప‌ణ‌ల‌పై ఏమంటార‌ని మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్నించారు. లోకేశ్ స్పందిస్తూ, అలాంటి ఆరోప‌ణ‌లు చేసే వారినే అడ‌గాల‌ని చెప్పి  త‌ప్పించుకున్నారు. అంతే త‌ప్ప, కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లకు లోకేశ్ ధైర్యం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

బాబు అరెస్ట్ వెనుక ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఉన్నార‌నే త‌మ ఆరోప‌ణ‌ల్ని సీపీఐ నాయ‌కుల‌తో టీడీపీ చేయించడాన్ని గ‌మ‌నించొచ్చు. భ‌య‌మంటే త‌మ బ్ల‌డ్‌లోనే లేద‌ని గొప్ప‌లు చెప్పుకునే నాయ‌కుల ధైర్య‌సాహ‌సాలు ఈ విధంగా ఏడుస్తున్నాయి. బాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉంద‌నే ఆధారాలు ఏమున్నాయ‌ని ఎవ‌రైనా ప్ర‌శ్నించొచ్చు. ఇలా ప్ర‌తిదీ నిజానిజాల‌ను నిర్ధారించుకునే అధికార ప్ర‌తిప‌క్ష‌ పార్టీలు విమ‌ర్శ‌లు చేసుకోవ‌నే సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. 

బాబును అరెస్ట్ చేయ‌డం వెనుక జ‌గ‌న్ కేవ‌లం పాత్ర‌ధారి మాత్ర‌మే అని, అస‌లు సూత్ర‌ధారి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీనే అని టీడీపీ అనుకూల నాయ‌కులు, ఎల్లో మీడియా ఆరోప‌ణ‌లు చేస్తోంది. అయినా తండ్రీత‌న‌యులు, టీడీపీ నేత‌లు మాత్రం బీజేపీపై నోరు తెర‌వ‌డానికి సాహ‌సించ‌డం లేదు. దేవునికైనా దెబ్బే గురువు అంటే ఇదే కాబోలు!