బిజెపి పరాజయాన్ని తేల్చేస్తున్న శకునాలు!

కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందని సామెత. కానీ టీబీజేపి సంగతి గమనిస్తే.. కాపురం చేసే కళ కల్యాణం జరగక ముందే అర్థమైపోతుందని అన్నట్లుగా ఉంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ…

కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందని సామెత. కానీ టీబీజేపి సంగతి గమనిస్తే.. కాపురం చేసే కళ కల్యాణం జరగక ముందే అర్థమైపోతుందని అన్నట్లుగా ఉంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎన్నికల నగారా మోగకముందే,  వారి పరాజయం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. 

పార్టీ ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తులు స్వీకరించే గడువు పూర్తయ్యే సమయానికి, ఎన్నికలలో ఆ పార్టీ నెగ్గి అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఆ పార్టీలోనే ఎవ్వరికీ లేదనే సంగతి తేట తెల్లం అయిపోతున్నది. తెలంగాణ భాజపాలో కీలకంగా పరిగణించదగిన నాయకులందరూ కూడా అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఒక్కరు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేయలేదు. ఈ ఒక్క సంకేతం చాలు భాజపా పరాజయం భయంతో తల్లడిల్లి పోతుందని అనుకోవడానికి!!

బిజెపిలోని రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోకపోవడం విశేషం. ఆయనతో పాటు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ తదితర నాయకులు ఎవ్వరూ కూడా ఎమ్మెల్యే టికెట్ కు దరఖాస్తు చేయలేదు.

ఈ పరిణామం గమనించినప్పుడు ఎవరికైనా సరే ‘ఎందుకు’ అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చే సత్తా లేదు కాబట్టి మాత్రమే వీరెవ్వరూ ఇక్కడ బరిలోకి దిగాలని అనుకోవడం లేదని విమర్శకులు అంటున్నారు. అదే పార్లమెంటు ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీకి ఆశావహ వాతావరణం ఉన్నందున, ఈ కీలక నాయకులందరూ కూడా అధికార పార్టీలో భాగంగా ఉండాలని వచ్చే ఎంపీ ఎన్నికలలో పోటీ చేస్తారని ఇప్పుడు మాత్రం అసెంబ్లీ ఎన్నికలను గాలికి వదిలేస్తున్నారని అనిపిస్తున్నది.

కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆ పార్టీలో ప్రస్తుతం ఎంపీలుగా చలామణి అవుతున్న నాయకులు కూడా అసెంబ్లీ ఎన్నికలలో టికెట్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎందుకంటే వారికి భారాసను ఓడించి తాము గెలవగలమనే నమ్మకం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి ఎంపీలు- ఎమ్మెల్యే బరిలో టికెట్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

బిజెపిలో అంత ధైర్యం కనిపించడం లేదు. కానీ ఇలాంటి పరిణామాల వలన బిజెపి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచే పరిస్థితి లేదని ప్రజలందరికీ కూడా అర్థం అవుతోంది. ఆ పార్టీకి పడే కాసిని ఓట్లు కూడా పక్కదారి పట్టి పోతాయి అని విశ్లేషణలు సాగుతున్నాయి.