నేను తలచుకుని వుంటే నాడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి బయటికి వచ్చేవాడా? నేను అనుకుని వుంటే అసలు జగన్ ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసేవాడా? నేను కన్నెర్ర చేస్తే జగన్ తట్టుకోలేరు….ఇవేవో బామ్మర్ది బాలయ్య సినిమా డైలాగ్‌లను చంద్రబాబు చెబుతున్నట్టుగా ఉంది. పోలీస్ అధికారులను, అధికార పార్టీ నాయకులను బెదిరించి లొంగదీసుకోవాలనే తాపత్రయం చంద్రబాబు మాటల్లో ప్రతిబింబిస్తోంది.
మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో పాలకప్రతిపక్ష పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటి నుంచే జనంలోకి వెళుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన మార్క్ బెదిరింపులకు శ్రీకారం చుట్టారు. మరో రెండేళ్లలో తామే అధికారంలోకి వస్తామని, అధికార పార్టీ నేతలు, పోలీస్, ఇతర అధికారుల కక్ష సాధింపు చర్యలన్నీ గుర్తు పెట్టుకుని వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు.
ఇవాళ ఆయన కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీని దెబ్బతీయాలని ఎన్నో కుట్రలు చేశారన్నారు. తప్పుడు కేసులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తననేమీ చేయలేరన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. అవినీతి కేసులున్న వ్యక్తి తమపై కేసులు పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పైశాచిక ఆనందం పొందుతున్న వ్యక్తికి గుణపాఠం చెబుతామని చంద్రబాబు తీవ్ర హెచ్చరిక చేశారు.
గతంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను తన పార్టీలో చేర్చుకోవడం ఆ పార్టీని దెబ్బతీయాలని చేశారా లేక మరే ఉద్దేశమైనా ఉందా? అనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పాలని వైసీపీ అడుగుతోంది. పార్టీని దెబ్బతీయాలనే కుట్ర చంద్రబాబు చేశారని గుర్తు చేస్తున్నారు.
తమ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టిన చంద్రబాబు ప్రత్యర్థులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా వుందని విమర్శిస్తున్నారు.