ప్రధాని మోదీ సర్కార్‌పై ట్విటర్ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పంచ్ అదుర్స్ అనిపించింది. ప్రత్యర్థులపై సెటైర్స్‌తో రేవంత్‌రెడ్డి విరుచుకుపడుతుంటారు. ఒక్కో సారి అవి తుస్సుమంటుంటాయి. తాజాగా గ్యాస్ ధరల పెంపుపై రేవంత్‌రెడ్డి పంచ్ వంకాయి బాంబులా పేలింది.
దేశం కోసం, ధర్మం కోసం మోదీ సర్కార్ మరోసారి గ్యాస్ ధరలు పెంచిందని వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. అలాగే ఈ భారాన్ని మీరు మోయలేక గొంతు విప్పి ప్రశ్నిస్తే దేశ ద్రోహులు, ధర్మం తప్పిన వారు అవుతారని బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ సర్టిఫై చేస్తోందని వ్యంగ్యంతో కూడిన హెచ్చరిక జారీ చేశారు. చివరిగా దేశవాసులారా జాగ్రత్త అని రేవంత్‌రెడ్డి అప్రమత్తం చేశారు.
ఘాటైన పంచ్‌లతో కూడిన రేవంత్ ట్వీట్ బీజేపీకి తూటాలా తగిలింది. ఇటీవల కాలంలో గ్యాస్ ధరలను మోదీ సర్కార్ ఇష్టమొచ్చినట్టు పెంచుతున్న సంగతి తెలిసిందే. సామాన్య ప్రజానీకంపై మోదీ సర్కార్ బాదుడు మామూలుగా లేదు. మోయలేని భారాన్ని మోపుతూ, ప్రజాందోళనలను ఏ మాత్రం పట్టించుకోకపోవడం ఒక్క మోదీ సర్కార్‌కే చెల్లింది.
నిత్యావసర సరుకుల థరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై ఎవరైనా ప్రశ్నిస్తే …రేవంత్ వెటకరించినట్టు దేశం కోసం, ధర్మం కోసమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రశ్నించిన వాళ్లపై దేశద్రోహుల ముద్ర వేసి, తన నియంతృత్వాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తోంది.