పేదలకు భయం పుట్టిస్తున్న బాబు సంకల్పం!

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సరికొత్త మాటల గారడీతో తన మార్కు కుట్ర రాజకీయాలకు తెరతీసినట్టుగా ప్రజలకు భయం కలుగుతోంది.  Advertisement ఏ నాయకుడు అయినా తన జన్మదినం నాడు, తన అభిమానులకు ప్రజలకు…

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సరికొత్త మాటల గారడీతో తన మార్కు కుట్ర రాజకీయాలకు తెరతీసినట్టుగా ప్రజలకు భయం కలుగుతోంది. 

ఏ నాయకుడు అయినా తన జన్మదినం నాడు, తన అభిమానులకు ప్రజలకు కొత్త వరాలు ప్రకటించడానికి ఉత్సాహం చూపిస్తాడు. అయితే చంద్రబాబునాయుడు.. తన 73 వ జన్మదినం జరుపుకుంటూ.. ప్రజలకు భయం పుట్టించే మాటలు చెబుతున్నారు. తియ్యటి ముసుగు వేసి తన జన్మదిన సంకల్పంగా ఆయన చెబుతున్నప్పటికీ.. ఆ మాటల వెనుక ఏ గూఢార్థం ఉన్నదో అని ప్రజలు కొందరు అనుమానిస్తున్నారు.

తన జన్మదినం నాడు మార్కాపురంలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించిన చంద్రబాబునాయుడు ఏం చెప్పారంటే.. రాష్ట్రంలో పేదరికం లేని సమాజం తయారు చేయాలని ఆయనకు కోరికగా ఉన్నదట. జన్మదినం సందర్భంగా ఆయన ఈ సంకల్పం తీసుకున్నారట. 

పేదరికం లేని సమాజం అంటే ఏమిటి? అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. అతిపెద్ద జనాభా ఉన్న దేశం మనది. జనాభా కారణంగా ధనిక పేద వ్యత్యాసాలు అపరిమితంగా ఉన్న సమాజం మనది. పేదరికం లేకుండా చేయడం అనే లక్ష్యానికి రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి పేదల్లో ఉపాధి అవకాశాలు పెంచి, ఆదాయమార్గాలు పెంచి వారు సమృద్ధిగా సంపాదించుకునే వనరులను సృష్టించడం. రెండోది అసలు పేదరికం అనే నిర్వచనాలను మార్చేయడం. ఆ కొలబద్ధలను మార్చేయడం. 

అసలు రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఏ వ్యక్తి అయినా సరే.. పేదలకోసం పనిచేయడమే తొలిలక్ష్యంగా ఎంచుకుంటాడు. పేదలను బాగుచేస్తానంటాడు. అసలు 44 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఈ 73 ఏళ్ల వృద్ధనేత, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా ఇప్పుడు పేదరికం లేని సమాజం సృష్టిస్తానని సంకల్పం తీసుకోవడం ఫార్సు కాక మరేమిటి? ఇన్నాళ్లు ఆయన ఏం చేస్తున్నారు. పేదరికాన్ని సృష్టిస్తూ బతికారా? ప్రభుత్వ వనరులన్నిటినీ.. అయిన వారికి, సంపన్నులకు దోచిపెట్టడమే పనిగా సేవలందించారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

‘పేదరికాన్ని మాయం చేస్తా’ అనే పదాలకు అర్థం.. తెల్ల రేషన్ కార్డులను ఏరివేయడమే అని జనం అనుకుంటున్నారు. తెల్లరేషన్ కార్డులు తగ్గించేసి.. పేదరికం తగ్గించినట్టుగా చంద్రబాబు చాటుకుంటారని ఎద్దేవా చేస్తున్నారు. అసలే చంద్రబాబు ఈసారి గెలిస్తే గనుక.. పేదలకు జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోతాయనే భయం ప్రజల్లో ఉంది. 

పేదరికాన్ని తొలగిస్తా అనే చంద్రబాబు మాటలు.. ఈ లబ్ధిదారుల జాబితాను కోతవేయడానికి మాత్రమే అనే ప్రచారం ఇప్పుడు మొదలవుతోంది.