పొత్తులపై నారా చంద్రబాబునాయుడు గందరగోళానికి లోనయ్యారు. జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంటే ఎలా వుంటుంది? పెట్టుకోకపోతే ఏమవుతుందనే తర్జనభర్జన పడుతున్నారు. దీంతో పొత్తులపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏమీ చెప్పలేకపోతున్నారు. తానే ఒక స్పష్టతకు రాకపోవడంతో, శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేయలేకపోతున్నారు. ఒకవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే, జనసేనతో చర్చలు జరుపుతున్నారు.
అయితే వారాహి యాత్రలో పవన్‌కల్యాణ్ రెండు నాల్కుల ధోరణితో రోజుకో మాట మాట్లాడుతుండడంతో టీడీపీ ఆగ్రహంగా వుంది. పొత్తులుంటాయని తానే ప్రకటించి, ఇప్పుడు మాట మార్చడం ఏంటనే ప్రశ్న టీడీపీ వైపు నుంచి వస్తోంది. టీడీపీ రాష్ట్రస్థాయి సర్వసభ్య సమావేశంలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 175 సీట్లు మనవే కావాలన్నారు. 175 చోట్ల వైసీపీని ఓడించి, మన అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
మన అభ్యర్థులే అంటే జనసేన, బీజేపీతో కలిపి బాబు చెబుతున్నారా? అనే అనుమానం టీడీపీ శ్రేణుల్లో కలిగింది. టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించుకుందామని చంద్రబాబు స్పష్టంగా చెప్పలేదు. దీంతో పొత్తులకు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయనే సంకేతాల్ని చంద్రబాబు ఇచ్చినట్టైంది. ఒకవైపు జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఈ దఫా తానే సీఎం అని పవన్‌కల్యాణ్ పదేపదే చెబుతుండడాన్ని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.
తమను పరిగణలోకి తీసుకోకుండా తనకు తానుగా ప్రచారం చేసుకుంటున్న పవన్‌కల్యాణ్ కోసం ఎదురు చూడడంలో అర్థం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. బాబు భయపడుతున్నారా? లేక ఇదేమైనా వ్యూహమా? అనేది తెలియడం లేదని టీడీపీ నాయకులు చెబుతున్న పరిస్థితి. మరోవైపు వైనాట్ 175 నినాదంతో వైఎస్ జగన్ దూసుకుపోతున్నారని, తాము మాత్రం పొత్తులుంటాయా? వుండవా? అనే చర్చతో పుణ్యకాలాన్ని వృథాగా గడపాల్సి వస్తోందని టీడీపీ వాపోతోంది.