జగన్ మెనిఫెస్టో ప్రకటన తర్వాత.. రాష్ట్రంలో ఎన్నికల హామీలపై చర్చ సాగుతూ ఉంది సామాన్య ప్రజల మధ్యన! ఎవరు గెలిస్తే.. ఏమేం చేస్తామంటున్నారు.. అనే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చల్లో ప్రధానంగా వినిపిస్తున్న మాట చంద్రబాబు ఏదైనా చెబుతాడు, అయితే చేయడంతే! అనే చర్చ కొనసాగుతూ ఉంది! ప్రత్యేకించి గ్రామీణులు, వ్యవసాయదారుల్లో చంద్రబాబు నాయుడు పూర్తిగా విశ్వాసం కోల్పోయారు!
ఐటీ బ్యాచ్ లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేస్తే రాత్రికి రాత్రి తమకు అమరావతిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చేస్తుందనే భ్రమలు ఉన్నాయి కానీ, గ్రామీణులకు, వ్యవసాయదారులకు, కూలీ పనులు చేసుకునే వారికి మాత్రం చంద్రబాబు నాయుడు ఒక మాయాగాడు అనే విషయంపై పూర్తి స్పష్టత ఉంది! చంద్రబాబు చెప్పే గారడీ మాటలను చదువుకున్న వాళ్లు నమ్ముతారేమో కానీ, జ్ఞానమున్న గ్రామీణులు మాత్రం చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు!
తనే హైదరాబాద్ ను కట్టా, మీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే దానికి కారణం తనేనంటూ, ఐటీని కనుగొన్నదే తనేనేంటూ చంద్రబాబు నాయుడు చెబితే.. ఎంబీఏలు, ఎంసీఏలు చేసిన అపర జ్ఞానులు చంద్రబాబు వల్లనే తాము ఐటీ ఉద్యోగం చేస్తున్నామనే నోరు తెరుచుకుని వింటూ ఉంటారు! అయితే సామాన్యులకు మాత్రం చంద్రబాబు తీరుపై పూర్తి స్పష్టత ఉంది!
చంద్రబాబు పంచిన మోనో క్రోటో ఫాస్ ముందు చేదు జ్ఞాపకాలు, కరెంటోళ్లను పంపి రైతులను ముప్పు తిప్పలు పెట్టిన రోజుల నుంచి మొదలుపెడితే 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అడ్డగోలు హామీలు ఇచ్చి, ఆ తర్వాత పంగనామాలు పెట్టారు! చంద్రబాబు పాలనలోకి వస్తే.. కరువులు ఏపీలో విలయతాండవం చేస్తూ ఉంటాయి! ఇలాంటి భయాలు కూడా రైతుల్లో బలంగా ఉన్నాయి.
మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్లీ చాలా గారడీలు చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాల విషయంలో, ఉచితాల విషయంలో అడ్డగోలు హామీలు ఇచ్చారు, ఇస్తున్నారు! అయితే ఆయన ఎన్ని చెప్పినా.. ఆయన మాటలపై మెజారిటీ ప్రజల్లో నమ్మకం లేదు! ఆయన అబద్ధాలు చెబుతారు, అధికారం కోసం ఏదైనా చేస్తానంటాడు అనేది ప్రజల్లో ఉన్న నమ్మకం! తీరా ఒక్కసారి అధికారంలోకి వస్తే.. చంద్రబాబు తీరు మారిపోతుంది. ఇదేమీ కొత్త కాదు! ఈ తీరుతో సామాన్య ప్రజలు విసిగి వేసారి పోయారు కూడా! బహుశా చంద్రబాబు నాయుడుకు సీఎం అభ్యర్థిగా ఇవే చివరి ఎన్నికలు!
ఈ సారి అధికారం పొందితే కొన్నాళ్లు తను కూర్చుని, ఆ తర్వాత తన తనయుడిని సీట్లో కూర్చోబెట్టేసే ప్లాన్లలో ఆయన ఉన్నట్టున్నాడు! మరి ఈ సారి చంద్రబాబు నాయుడు అడ్డగోలు హామీలు ఇప్పటికే చాలా ఇచ్చారు, జగన్ పెట్టిన సంక్షేమ పథకాల స్థాయిని మూడు రెట్లు పెంచుతానంటూ ప్రగల్బాలు పలుకున్నారు. అయితే వాటి ప్రభావం ఇప్పటి వరకూ లేదు!
ఇక పోలింగ్ రెండు వారాల నేపథ్యంలో ఇప్పుడు మెనిఫెస్టో రూపంలో చంద్రబాబు గారడీలు సాగవచ్చు. ఎలాగూ అమలు చేసే హామీలు కావు కాబట్టి, నమ్మే వాళ్లు ఉండకపోరన్నట్టుగా చంద్రబాబు అడ్డగోలు హామీలను అధికంగా ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది! అయితే చంద్రబాబు నాయుడు విశ్వసనీయత ఏనాడో ప్రశ్నార్థకంగా మారింది. అలాంటిది ఇప్పుడు ఆయన చేసే గారడీ కామెడీలు కావడంలో ఆశ్చర్యం లేదు!