నాయకుడనే వాడు ప్రజల్లో నమ్మకాన్ని సాధించాలి. ఆ నమ్మకం పునాదిగా తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకోవాలి. నమ్మకంతో పాటుగా, ప్రజల ఆదరణను, ప్రేమను పొందగలగాలి. అవే ఆలంబనగా తన రాజకీయ ప్రస్థానం సాగాలిన అనుకోవాలి. కానీ తాను ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇండస్ట్రీ అని పదేపదే టముకు వేసుకుంటూ బతికే చంద్రబాబునాయుడు స్టయిలు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ప్రధానంగా ఆయన ఇతర పార్టీల బలం మీద బతకాలనే అనుకుంటారు. అంతకంటె హేయంగా.. ప్రజల ప్రేమను కాదు కదా, వారి జాలిని పొందాలని అనుకుంటారు. అలాంటి జాలికోసం అబద్ధపు డైలాగులతో చెలరేగుతుంటారు.
తాజాగా ఆయన, తన మీద నమోదైన కేసుల విషయంలో భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. పుంగనూరు అల్లర్లు, పోలీసుల మీద దాడి, హత్యాయత్నం కేసులకు సంబంధించి అసలు సూత్రధారిగా చంద్రబాబునాయుడు మీద కూడా కేసులు నమోదై ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఈ కేసుల్లో ఇప్పటికే.. పాత్రధారి చల్లాబాబు తన అనుచరుల సహా పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
చంద్రబాబును కూడా అరెస్టు చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. అదేదో మహా ఘోరం జరగబోతున్నట్టుగా.. చంద్రబాబునాయుడు.. విలపిస్తున్నారు. ప్రభుత్వం తనకేదో ద్రోహం చేసేస్తున్నట్టుగా నేను అరెస్టు కాబోతున్నా.. నన్ను అరెస్టు చేస్తారేమో అని ఆయన ఊరూరా తిరిగి చెప్పుకుంటున్నారు.
జనం జాలికోసం చంద్రబాబునాయుడు కల్లమాటలు చెప్పడం.. చంద్రబాబునాయుడుకు కొత్త కాదు. తన భార్య విషయంలో వివాదం రేగినప్పుడు.. వైసీపీ ఎమ్మెల్యేలు దూకుడుగా అన్న మాటలు ఒకఎత్తు మరియు ఒకసారి మాత్రమే కాగా.. చంద్రబాబునాయుడు మాత్రం ఊరూరా తిరిగి కన్నీళ్లు పెట్టుకుంటూ.. తన భార్యను బజారుకీడ్చి రాజకీయం చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు అరెస్టు పాట ఎత్తుకున్నారు.
అయినా చంద్రబాబు నేరం చేసినప్పుడు అరెస్టు చేయకుండా ఎందుకు ఉంటారు? దాన్ని ఎదుర్కొనే చేవ ఉండాలి.. నిర్దోషిగా బయటపడే పోరాటపటిమ ఉండాలి తప్ప.. అసలు అరెస్టే జరగకూడదు అన్నట్టుగా.. నేను నిప్పులా బతికాను.. నేను ఏ తప్పూ చేయలేదు.. అని ప్రజల ముందు విలపిస్తే ప్రయోజనం ఏంటి? ఆయన ఆశించేది జనంలో జాలి మాత్రమే.
ఈ జాలి వలన ఓట్లు రాలవు. తాను తప్పు చేయలేదని ఆయన కోర్టులో నిరూపించుకుంటే, అప్పుడు ప్రభుత్వం వేధించడానికే అరెస్టు చేసిందని ఇంకా గట్టిగా ప్రజలు ముందుకు వెళ్లి విమర్శలు చేయవచ్చు. అంతే తప్ప ఇలాంటి బేల మాటలు పనికి రావని ప్రజలు అనుకుటున్నారు.