స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబును ఎట్టకేలకు ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనగానే చంద్రబాబుకు అనారోగ్యమంటూ న్యాయవాదులు, టీడీపీ నాయకులు మీడియా ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. చంద్రబాబు వరుసగా మీటింగ్‌ల్లో పాల్గొంటున్నా ఆయన అనారోగ్యం గురించి ప్రస్తావన లేదు. ఎప్పుడైతే అరెస్ట్, జైలు అని చెప్పగానే చంద్రబాబు వృద్ధాప్యం, అనారోగ్యం తెరపైకి రావడం గమనార్హం.
చంద్రబాబు హైబీపీ, డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు సీఐడీ అధికారుల దృష్టికి చంద్రబాబు లాయర్లు తీసుకెళ్లారు. ఇదే విషయాన్ని మీడియాకు కూడా వారు చెప్పారు. తద్వారా సానుభూతి పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. రూ.300 కోట్లకు పైబడి అవినీతికి పాల్పడిన విషయాన్ని మరుగున పరిచి, బాబు అరెస్ట్‌ను రాజకీయంగా వాడుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం తన ప్రయత్నాల్ని వేగవంతం చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబునాయుడి అరెస్ట్‌ను ఖండిస్తూ నిరసనలకు టీడీపీ పిలుపునిచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల టీడీపీ నాయకులు రోడ్డుమీదకి వచ్చి ఆందోళనలకు దిగారు. అలాంటి వారిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌లకు తరలిస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్, ఆయన అనారోగ్యం చుట్టూ చర్చించేందుకు ఎల్లో మీడియా ఉత్సాహం ప్రదర్శిస్తోంది. ఆయన అరెస్ట్‌కు కారణమైన అవినీతిని మాత్రం సాధ్యమైనంత తక్కువగా తెలియాలని కోరుకుంటోంది.