స్కిల్ డెవలప్మెంట్ -సీమెన్స్ ప్రాజెక్టులో రూ.371 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఏ1 నిందితుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేశారు. ఇక తర్వాత వికెట్ ఎవరనే ప్రశ్నకు… వెంటనే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు వినిపిస్తోంది. ఈ కేసులో ఏ2 నిందితుడు అచ్చెన్నాయుడు. గతంలో ఈఎస్ఐలో అవినీతికి పాల్పడిన కేసులో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కుంభకోణానికి కేంద్రమైన స్కిల్‌డెవలప్‌మెంట్ సంస్థ కార్మికశాఖ పరిధిలోకి వస్తుంది. ఈ కుంభకోణంలో చంద్రబాబు నాయుడితో పాటు అచ్చెన్నాయుడి పాత్ర కూడా ఉన్నట్టు సీఐడీ నిర్ధారించింది. ఈ మేరకు అచ్చెన్నను ఏ2 నిందితుడిగా చేర్చింది.
తాజాగా ఏ1 నిందితుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో, అందరి దృష్టి అచ్చెన్నపై పడింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద ఎలాంటి పోలీసుల అలికిడి కనిపించడం లేదు.
చంద్రబాబునే అరెస్ట్ చేసిన తర్వాత, అచ్చెన్నను విడిచిపెడతారని ఎవరూ అనుకోవడం లేదు. అయితే ఎప్పుడనేదే ప్రశ్న. ఏ1 నిందితుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో, ఇక ఏ2 నిందితుడిని కూడా జైలుకు పంపే అవకాశాలున్నాయనే చర్చకు తెరలేచింది.