కడప అసెంబ్లీకి సంబంధించి టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కడప అసెంబ్లీ అంటే ముస్లిం మైనార్టీలకు కంచుకోట అనేలా గుర్తింపు పొందింది. ఈ ప్రచారం నిజమే అనేలా అక్కడి నుంచి ముస్లిం మైనార్టీ నాయకులే ఎక్కువగా గెలుస్తున్నారు. చివరిగా కందుల శివానందరెడ్డి కాంగ్రెస్ తరపున కడప నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి ఖలీల్‌బాషా చేతిలో కందుల ఓడిపోయారు.
అనంతర కాలంలో కాంగ్రెస్ తరపున అహ్మదుల్లా బరిలో నిలిచారు. ఆయన గెలుపొందారు. వైసీపీ కూడా మైనార్టీలకే టికెట్ ఇస్తూ వచ్చింది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అంజాద్‌బాషా కేబినెట్‌లో డిప్యూట్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో కడప ప్రజానీకం ఆలోచనల్లో మార్పు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ముస్లిమేతరులంతా తమకంటూ ఒక ప్రతినిధి వుండాలని మధనపడుతున్నట్టు చెబుతున్నారు. అందుకే టీడీపీ వ్యూహాత్మకంగా ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాస్‌రెడ్డి సతీమణి రెడ్డెప్పగారి మాధవీరెడ్డిని బరిలో నిలిపేందుకు సిద్ధమైంది. కడపలో రెడ్డి, బలిజ, క్రిస్టియన్ మైనార్టీలు, బీసీల సంఖ్య బలంగా ఉంది. పార్టీలకు అతీతంగా కుల, మతపరంగా కడప ప్రజలు ఏకమవుతారని టీడీపీ ఆశ పెట్టుకుంది.
కడప సీటు ఒక వర్గానికే పరిమితం కాలేదనే చర్చకు తెరలేచింది. కడప సీటు అందరిదీ అని చాటి చెప్పేందుకైనా వైసీపీకి వ్యతిరేకంగా మాధవీని ఆదరిస్తారని టీడీపీ ధీమాగా వుంది. ఈ ధీమా సుదీర్ఘ కాలం తర్వాత టీడీపీని గెలిపిస్తుందా? అని చెప్పలేం. కానీ కడపలో మాత్రం వైనాట్ అదర్ క్యాస్ట్స్ అనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీన్ని సానుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు ఎంత వరకూ సత్ఫలితాలను ఇస్తాయో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.