జైలులో బాబు.. విహారంలో తమ్ముళ్ళు

చంద్రబాబు జైలులో ఉన్నారు. పార్టీకి పెద్ద దిక్కు అలా నాలుగు గోడల మధ్యన బంధీగా మారితే ఆ పార్టీ తమ్ముళ్ళు ఏమి చేయాలి. జనంలో ఉండాలి కదా. కానీ జీవీఎంసీలో టీడీపీకి చెందిన కార్పోరేటర్లు…

చంద్రబాబు జైలులో ఉన్నారు. పార్టీకి పెద్ద దిక్కు అలా నాలుగు గోడల మధ్యన బంధీగా మారితే ఆ పార్టీ తమ్ముళ్ళు ఏమి చేయాలి. జనంలో ఉండాలి కదా. కానీ జీవీఎంసీలో టీడీపీకి చెందిన కార్పోరేటర్లు ఇపుడు విహార యాత్రలో ఉన్నారు. నిజానికి ఈ విహార యాత్ర టైం నాటికే బాబు నంధ్యాలలో అరెస్ట్ అయి ఉన్నారు. ఆయన్ని శనివారం ఉదయం అరెస్ట్ చేస్తే టీడీపీ కార్పోరేటర్లు ఆదివారం మధ్యాహ్నం చలో టూర్ కి అంటూ చెక్కేశారు.

వియ్ స్టాండ్ విత్ యూ సీబీఎన్ అని టీడీపీ నేతలు అంటున్నారు. కార్పోరేటర్లు మాత్రం అంత తీరిక ఓపిక లేకుండా విహారానికి బయల్దేరివెళ్లడమే ఇపుడు హాట్ డిస్కషన్ గా మారింది. టీడీపీకి విపక్షాలు మద్దతుగా నిలిస్తే సొంత పార్టీకి చెందిన కార్పోరేటర్లు వారం రోజుల పాటు అధ్యయన యాత్ర పేరిట విహారయాత్రకు వెళ్ళడం పైన సొంత పార్టీలోనూ తర్కించుకుంటున్నారు.

వీరంతా దగ్గరలో కూడా ఈ అధ్యయన యాత్ర పెట్టుకోలేదు. శ్రీనగర్ దాకా వెళ్తున్నారు. అక్కడ కార్పొరేషన్ లో జరుగుతున్న అభివృధ్ధి పనులు ఏమిటి వాటిని ఎలా విశాఖలో అమలు చేయవచ్చు అన్న దాని మీద వీరంతా వెళ్తున్నారు. ఆదివారమే విమానమెక్కి వెళ్ళిన వీరంతా వారం రోజులకు కానీ తిరిగి రారు అని అంటున్నారు.

ఇలా వెళ్తున్న టీడీపీ కార్పోరేటర్లు తమ ఫోటోలను స్టేటస్ లో పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారే కానీ బాబు అరెస్ట్ ఆయన రిమాండ్ వంటి వాటిని అసలు పట్టించుకున్నట్లుగా కనిపించడంలేదు అని అంటున్నారు. మొత్తం 99 మంది జీవీఎంసీ కార్పోరేటర్లలో 81 మంది ఈ టూర్ కి వెళ్లడం విశేషం.

జీవీఎంసీలో టీడీపీకి 30 మంది కార్పోరేటర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు నలుగురు తప్ప అంతా టూర్ కే ప్రాధాన్యత ఇవ్వడం మీద సొంత పార్టీలో విమర్శలు వస్తున్నాయి. టీడీపీకి నిజంగా కష్ట కాలం పెద్ద దిక్కు చంద్రబాబే జైలులో ఉంటే పార్టీని కాపాడుకోవాల్సిన వేళలో ఈ టూర్లు ఏంటి అని విమర్శలు పసుపు పార్టీలోనే వినవస్తున్నాయి.

అయినా ముందుగానే నిర్ణయించుకున్న కార్యక్రమం అంటూ అధికార వైసీపీ కార్పోరేటర్లతో కలసి చెట్టాపట్టాలు వేసుకుంటూ తమ్ముళ్ళు వెళ్లడం అంటే ఏమనుకోవాలో ఆర్ధం కావడం లేదని అంటున్నారు. సోమవారం విశాఖలో బంద్ కూడా చప్పగా సాగింది. కార్పోరేటర్లు లేని ప్రభావం స్పష్టంగా కనిపించింది.