వైసీపీ ప్రభుత్వ హయంలో విశాఖలో భూ దందా అంటూ టీడీపీ నేతలు తరచూ ఆరోపణలు చేస్తూ ఉంటారు. కానీ అదే పార్టీలో దశాబ్దాల పాటు పనిచేసి ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ రహమాన్ టీడీపీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విశాఖ నగరంలోని విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములూ దోపిడీకి గురి అయ్యాయని రహమాన్ ఆరోపించారు.
ఉద్దేశ్యం ఏమిటి అన్నది లేకుండా భూములను పందేరం చేసుకుంటూ పోయారని, అలాగే భూ దోపిడీకి అంతూ పొంతూ లేకుండా పోయిందని ఆయన అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం కేవలం అభివృద్ధినే అజెండాగా చేసుకుందని, మంచి ఉద్దేశ్యంతో ఎవరైనా ప్రాజెక్ట్ చేపట్టడానికి వస్తేనే భూములను కేటాయిస్తోంది రహమాన్ తేడా ఏంటో చూపించారు.
దీని వల్ల ప్రభుత్వ భూములకు రక్షణ ఉందని, అలాగే ప్రగతి కోసమే భూముల కేటాయింపు అన్నది మంచి విధానంగా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని రహమాన్ కితాబు ఇచ్చారు. ముస్లిం మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం గతంలో ఎవరూ చేయని విధంగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన అన్నారు.
ఏపీలో ఇపుడున్న పరిస్థితుల నేపధ్యంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతీ ఒక్కరు సమర్ధించాలని ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సజావుగా సాగాలన్నా వైసీపీనే ఎన్నుకోవాలని రహమాన్ అంటున్నారు. జగన్ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అహరహం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి అని ఆయన ప్రశంసించారు. రహమాన్ చెబుతున్న దాన్ని బట్టి భూ దందా అంటే గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని అంతా తెలుసుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు.