ఏంటో.. నెలరోజులుగా నడుస్తూ ఉండే సరికి.. పాపం, చినబాబు నారాలోకేష్ కు మోకాలిలో నొప్పులు మొదలై బ్రెయిన్ పనిచేస్తున్నట్టు లేదు. ఏదేదో మాట్లాడుతున్నారు. నిజానికి పాదయాత్ర వలన మతి చలించిందో లేదా, గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ కు వచ్చిన స్పందన, వచ్చిన 13 లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలను చూసి మైండ్ బ్లాక్ అయిందో తెలియదు గానీ.. పాపం.. జగన్ సర్కారు మీద విమర్శలు చేయడానికి నానా పాట్లు పడుతున్నారు.
లోకేష్ బాబు తాజా డిమాండ్ ఏంటంటే.. జగన్ తన కంచుకోట నియోజకవర్గాల్లో గెలిచి గొప్పలు చెప్పుకోవడం కాదంట.. గతంలో వైకాపా గెలవని చోట పోలీచేసి గెలిచే సత్తా ఉందా అని అడుగుతున్నాడు. పాపం చినబాబు ఈ మాత్రం లాజికల్ గా అడగడం గొప్ప విషయమే. అయితే.. గతంలో వైకాపా ఎన్నడూ గెలవని కుప్పం మునిసిపాలిటీని వైకాపా గెలుచుకున్న సంగతి చినబాబు మర్చిపోయినట్టుగా ఉన్నదని.. జనం నవ్వుకుంటున్నారు.
కుప్పంలో నానా కష్టాలు పడి, ఓటుకు పదివేల రూపాయలు కూడా పంచినట్టుగా తెలుగుదేశం నాయకులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయినా సరే.. పతనం తప్పలేదు. పరువు దక్కలేదు. మునిసిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం దారుణంగా ఓడిపోయింది. ఏడుసార్లుగా నన్ను కుప్పం ప్రజలు గెలిపిస్తూనే ఉన్నారు అని గప్పాలు కొట్టుకునే చంద్రబాబునాయుడు పరువు పోయింది. ఆ తర్వాతి అసెంబ్లీ సమావేశాల సమయంలో.. అచ్చెన్నాయుడును ఉద్దేశించి.. ‘మీ నాయకుడిని ఓసారి చూడాలి.. మొహం చూడాలని ఉంది’ అని జగన్ ఎద్దేవా చేయడం కూడా జరిగింది. ఆ పరాభవం చినబాబు మరచిపోయినట్లుంది.
కుప్పం మునిసిపాలిటీ మాత్రమే కాదు కదా.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును కూడా గెలవనివ్వకుండా చేయడానికి కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా..కుప్పం ప్రజలకు చంద్రబాబు రుచిచూపించని అభివృద్ధిని జగన్ అందిస్తున్నారు. ఆ రకంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా కుప్పం ప్రజలు వైసీపీకే బ్రహ్మరథం పట్టడం తథ్యం అని అంతా అనుకుంటున్నారు. ఇలా వారు ముందుకు సాగుతుండగా.. గతంలో వైసీపీ గెలవని చోట గెలిచిచూపించండి అంటూ నారాలోకేష్ పసిపిల్లల ప్రగల్భాలు పలుకుతుండడమే తమాషా.
అమరావతి అనే మాయామంత్రాలు పనిచేస్తాయని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకుని చతికిలపడిన లోకేష్, గతంలో తమ పార్టీకి పట్టులేని ఆ నియోజకవర్గం నుంచి తాను గెలిచి.. కంచుకోటగా మారుస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం విశేషం.