తెలంగాణలో ఓకే.. ఏపీలో తలపోటే!

ఏదో చెప్పుకోడానికి అందంగా కనిపిస్తుంది కదాని..నారా చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకే అనే నినాదం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అచ్చంగా ఆచరించాలనుకుంటే.. పార్టీకి తలపోటు తప్పదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. …

ఏదో చెప్పుకోడానికి అందంగా కనిపిస్తుంది కదాని..నారా చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకే అనే నినాదం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అచ్చంగా ఆచరించాలనుకుంటే.. పార్టీకి తలపోటు తప్పదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. 

పార్టీకి టికెట్ అడిగే దిక్కేలేని తెలంగాణలో యువతకు టికెట్లు అనే ట్యాగ్ లైన్ జోడించి కొత్తవారిని తెరమీదకు తేవడం సాధ్యమే గానీ, ఏపీలో అది కుదురుతుందా? లేదా, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 40 శాతం టికెట్లు అనే మాయ చేసి.. మెజారిటీ టికెట్లు తెలంగాణలో యువతరానికి ఇచ్చేసి మభ్యపెడతారా? అనే రకరకాల అభిప్రాయాలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. 

ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు విజయాలు దక్కేసరికి.. పార్టీలో ఇన్నాళ్లుగా మరుగున పడిపోయిన వారికి, పార్టీకి భవిష్యత్తు ఉండదు అనుకుని పార్టీ జెండాను అటక మీద పెట్టేసి సైలెంట్ అయిపోయిన వారికి, ఇన్నాళ్లూ కనీసం పార్టీ కార్యక్రమాలకు, చంద్రబాబు పిలిచినా కూడా హాజరు కాకుండా డ్రామాలు ఆడిన వారికి అందరికీ కొత్త ఆశలు పుడుతున్నాయి. 

ఇన్నాళ్లూ ముసుగుతన్ని పడుకున్న ముసలీ ముతకా నాయకులందరూ కూడా మళ్లీ ఎన్నికల్లో పోటీచేయడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో 40 శాతం యువతరానికి టికెట్లు అనేది తెలుగుదేశం పార్టీకి ఏదో నినాదంలాగా ఉపయోగపడవచ్చు గానీ.. ఏపీలో ఆచరణలో అది సాధ్యమేనా? అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

చంద్రబాబునాయుడు బేసిగ్గా పిరికిగా ఉంటాడనే అభిప్రాయం పార్టీలో ఉంది. సీనియర్లు గట్టిగా పట్టుబడితే టికెట్ నిరాకరించేంత, వారి అసంతృప్తిని భరించేంత ధైర్యం చంద్రబాబుకు లేదనేది పలువురి అభిప్రాయం. చంద్రబాబును ఖాతరు చేసే అలవాటు లేనివారు, తెలుగుదేశం పార్టీలో ఆయనకంటె సీనియర్లు పలువురు ఉన్నారు. వాళ్లు గట్టిగా తమకు టికెట్ కావాల్సిందేనని పట్టుబడితే ఆయన ఏం చేస్తారు? అనేది ఇలాంటి సందర్భంలో కీలకం. 

ఇంతకూ యువతకు టికెట్లు అంటే చంద్రబాబునాయుడు దృష్టిలో నిర్వచనం ఏమిటో కూడా గమనించాలి. నలభయ్యేళ్ల లోకేష్ ను యువనాయకుడిగా నిర్వచిస్తే పరవాలేదు. కానీ.. ‘యువత’ అనే నిర్వచనాన్ని యాభైకి, అరవైకి పెంచుకుంటూ పోతేనే కామెడీగా ఉంటుంది. 

యువతకు టికెట్లు అనే మాయ ముసుగు వేయకుండా.. అటు వయసు మళ్లిన సీనియర్లకు, ఇటు నలభైల్లో ఉండే ప్రతిభావంతులకు కూడా సమతూకంతో అవకాశం ఇస్తూ పోతేనే చంద్రబాబునాయుడుకు సత్ఫలితాలు ఉంటాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు.