వారి ఆశలను చంద్రబాబు అందుకోగలరా?

2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన వారికి అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన గ్యారెంటీడ్ పెన్షన్ పథకం నిలిచిపోయింది. నిజానికి ఈ జిపిఎస్ విధానాన్ని జగన్ సర్కారు…

2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన వారికి అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం స్థానంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన గ్యారెంటీడ్ పెన్షన్ పథకం నిలిచిపోయింది. నిజానికి ఈ జిపిఎస్ విధానాన్ని జగన్ సర్కారు చాలాకాలం ముందే ప్రకటించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత జూన్ 12న దీనికి సంబంధించిన జీవో రాగా, జులై 12న గెజిట్ విడుదల అయింది.

ప్రభుత్వంలోని పెద్దల్లో ఎవరి అనుమతి లేకుండా, కనీసం వారికి సమాచారం కూడా లేకుండా గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేయడం పట్ల ఆగ్రహించిన చంద్రబాబు నాయుడు దీనిని నిలిపివేయాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది గానీ సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులు పెట్టుకోగల ఆశలను తీర్చడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగానే ఉన్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాల మేరకు సిపిఎస్ ను రాష్ట్రంలో కూడా అమలు చేశారు. ఆ తర్వాత ఉద్యోగాలలో చేరిన వారంతా ఆ విధానానికి దాదాపుగా అలవాటు పడిపోయారు.

2019 ఎన్నికలకు పూర్వం పాదయాత్ర నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఒక ఘనమైన హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దుచేసి వారం రోజుల్లోగా ఓపిఎస్ పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరిస్తానని ప్రకటించారు. ఆనాటికి ఇది ఉద్యోగులకు చాలా పెద్ద వరం కింద లెక్క. వారందరూ జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి తాను ఇచ్చిన హామీ ఎంత పెద్ద పొరపాటో ఆయనకు అర్థం అయింది. ప్రభుత్వం మీద ఎంత పెను భారం పడగలదో తెలిసి వచ్చింది. దాంతో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని, అందుకు ప్రత్యామ్నాయంగా ఏదైనా సలహాలు సూచించాలని ఉద్యోగులతోనే చర్చలు జరిపారు. కానీ ప్రభుత్వం మీద పడగల భారాన్ని పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తమకు పాత పెన్షన్ విధానం మాత్రమే కావాలని ఉద్యోగులు పట్టుబట్టడం జరిగింది.

జగన్ ప్రభుత్వం రాజీ పడకుండా మధ్యేమార్గంగా గ్యారంటీడ్ పెన్షన్స్ స్కీమ్ అనే కొత్త పద్ధతిని తీసుకువచ్చింది. సిపిఎస్ కంటే ఉద్యోగులకు అధిక ప్రయోజనాలు కలిగే లాగా ఈ విధానాన్ని రూపొందించారు. అయితే ఉద్యోగులు మాత్రం దానిని వ్యతిరేకిస్తూనే వచ్చా రు.

మొత్తానికి అప్పట్లో రావాల్సిన జీవో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రావడం, గెజిట్ రావడం జరిగింది. చంద్రబాబు దాన్ని నిలిపివేయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి సుముఖంగా ఉన్నారని ఉద్యోగులందరూ ఆశలు పెట్టుకుని అవకాశం ఉంది. చంద్రబాబు అందుకు సిద్ధమేనా అనేది పెద్ద ప్రశ్న. ప్రభుత్వం మీద అంత పెద్ద భారం మోపడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా అనేది సందేహం.

సిపిఎస్ ను అదే రీతిలో కొనసాగనిస్తారా లేదా ఓ పి ఎస్ తెస్తానని చెబుతారా వేచి చూడాలి. ఆయన ఎన్నికల సమయంలో మాత్రం ఓపీఎస్- సీపీఎస్ వివాదం జోలికి కూడా వెళ్లలేదు. ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఇప్పుడైతే జీపీఎస్ ను రద్దు చేశారు గానీ.. ఉద్యోగుల ఆశలను ఎలా తీరుస్తారో చూడాలి.