కాంగ్రెస్ గెలుపు కోసం రుణ మాఫీ సంబరాలు 

ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది రాజకీయ పార్టీలు. నిర్వహించేది  అంటే పరిపాలించేది రాజకీయ పార్టీలు. వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం చేసే పనులకు భారీ ప్రచారం అవసరం. ఈ కాలంలో…

ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది రాజకీయ పార్టీలు. నిర్వహించేది  అంటే పరిపాలించేది రాజకీయ పార్టీలు. వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం చేసే పనులకు భారీ ప్రచారం అవసరం. ఈ కాలంలో ప్రచారానికి ఏమీ కొదవ లేదు. ప్రభుత్వం చేసే పనులకు అనేక మార్గాల ద్వారా ప్రచారం జరుగుతుంది. పత్రికలున్నాయి. టీవీ చానెళ్లు ఉన్నాయి.

ప్రభుత్వమే రోజూ అది చేస్తున్న పనుల గురించి ఊదరగొడుతూ ఉంటుంది. సమాచార శాఖ ఉండేది అందుకేగదా. మా ప్రభుత్వం అంత చేస్తోంది…ఇంత చేస్తోందని చెప్పడానికి నాయకులనబడే భజన బృందాలు ఉంటాయి. వాళ్ళు ప్రతీ సందర్భంలోనూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి చెబుతూనే ఉంటారు. ప్రభుత్వం ఏం చేస్తోంది అనే సమాచారం మినిట్ టూ మినిట్ జనంలోకి వెళ్ళిపోతుంది.

అయినప్పటికీ ప్రభుత్వానికి ఇంకా ప్రచారం కావాలి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో గెలవడానికి దోహదం చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణ మాఫీ చేయడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 15 వరకల్లా చేయాలని రెడీ అవుతోంది. నిధులు సమకూర్చుకుంటోంది.

రైతు రుణ మాఫీ అనేది ప్రభుత్వానికే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా జీవన్మరణ సమస్య. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణ మాఫీ చేయలేదని, చేయడం సాధ్యం కాదని గులాబీ పార్టీ నాయకులు బల్ల గుద్ది చెప్పారు. చేస్తే తాను రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నానని హరీష్ రావు అన్నాడు. రాజీనామా లెటర్ జేబులో రెడీగా పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇద్దరూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు.

మరి ఇంత చేశాక రుణ మాఫీ చేయకపోతే పరువు పోతుంది. ప్రతిపక్షాలకు ఆయుధం దొరుకుతుంది. కాబట్టి అందుకు అవకాశం ఇవ్వాలనుకోలేదు. మరి ఇంత కష్టపడి రుణ మాఫీ చేస్తున్నప్పుడు దానికి భారీగా ప్రచారం కావాలి కదా. అది కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు కావాలి. అందుకే రుణ మాఫీ సంబరాలు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని అనుకుంటున్నారు. రుణ మాఫీ కారణంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బెనిఫిట్ కలగొచ్చుగానీ ఈ భారీ ప్రచారం వల్ల మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలో కాంగ్రెస్ కు గెలిచే అవకాశాలు ఉండొచ్చని అనుకుంటున్నారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఈ ప్రభావం ఆ రాష్ట్రాల మీద పడుతుందన్న మాట. కాబట్టి రుణ మాఫీని ఎప్పుడూ గుర్తుండిపోయే పండుగలా చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.