తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవతరించిన టీఆర్ఎస్ ఎన్నో గెలుపోటములను మూటకట్టుకుంది. అధినేతగా కేసీఆర్ ఓటములకు కుంగిపోలేదు. విజయాలకు పొంగిపోలేదు. అన్నింటినీ సమానంగా స్వీకరించారు. టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించడం వెనుక పరోక్షంగా చంద్రబాబు ఉన్నారని చెప్పొచ్చు.
కేసీఆర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోకుండా, డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపుచ్చారు. దాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. రాజకీయంగా ప్రత్యేక పంథాను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో అదే ప్రత్యేక తెలంగాణను సాధించి పెట్టింది. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. శిష్యుడైన కేసీఆర్ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందించారు.
దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని చంద్రబాబు సతీసమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందించాలని మీడియా ప్రతినిధులు అడిగారు. ఇందుకు చంద్రబాబు ఓ నవ్వు నవ్వి అదే సమాధానమన్నట్టు అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
కేసీఆర్ జాతీయ పార్టీని ఓ జోక్‌గా చంద్రబాబు తన నవ్వుతో అభివర్ణించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందించాల్సింది ఏమీ లేదన్నట్టు బాబు రియాక్షన్ వుందనే వాళ్లు లేకపోలేదు. మొత్తానికి శిష్యుడి నూతన పార్టీపై ఆచితూచి వ్యవహరించాలన్నట్టుగా చంద్రబాబు వైఖరి వుంది.