జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా సాగిందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ సమీక్షించాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో ప్రజలు ఆయనను ఓడించి తమ తీర్పు ఏమిటో స్పష్టంగానే చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు.. ఇప్పటి దాకా ప్రతిరోజూ జగన్ ను స్మరించుకోవడంతోనే గడిపేస్తున్నారు.
ప్రతి రోజూ జగన్ మోహన్ రెడ్డి మీద నిందలు వేయడంతోనే ఆయన ఈ అయిదేళ్ల పాలనను కూడా పూర్తిచేస్తారేమో అనిపించేలా వ్యవహరిస్తున్నారు. ఆవువ్యాసం లాగా.. ఏ విషయం గురించి ఏ వేదిక మీద మాట్లాడాల్సి వచ్చినా సరే.. చంద్రబాబునాయుడు తిప్పతిప్పి దానిని జగన్ మీదకు తీసుకువస్తారు.
జగన్ వలన ఖజానా ఖాళీగా ఉందంటారు. జీవితాంతం జగన్ మీద నిందలు వేస్తూ.. ఏ పనీ చేయడానికి డబ్బులు లేవని నాటకీయ డైలాగులు చెబుతూ గడిపేయడానికి ఆయన సారథ్యంలోని కూటమికి 164 సీట్లతో తెలుగు ప్రజలు ఘనవిజయం కట్టబెట్టలేదు కదా..? అనే వాస్తవాన్ని ఆయన మరచిపోతున్నారు.
జగన్ పరిపాలన హయాంలో అప్పులు తెచ్చిన మాట వాస్తవమే. అయితే అప్పులు తేకుండా దేశంలో ఏ రాష్ట్రం కూడా మనుగడ సాగిస్తున్న పరిస్తితి లేదు. ఆర్థిక పరిస్థితి గురించి శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఖజానా వ్యవహారాలను చెబితే ఒక మోస్తరుగా ఉంటుంది. కానీ.. ఏ వేదిక దొరికినా సరే, జగన్ పాటే పాడుతూ ఉంటే.. జనానికి వెగటు పుడుతుంది.
అసలు చంద్రబాబునాయుడు తన పరిపాలనలో ఏ కొద్ది పనులైనా చేయదలచుకున్నారా? లేదా మళ్లీ ఎన్నికలొచ్చేదాకా.. జగన్ వల్ల ఖజానాల్లో డబ్బుల్లేవు అని చెప్పుకుంటూ ఉంటారా? అనేది ప్రజల సందేహం.
ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు, అమరావతిని పరిశీలించారు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా పరిశీలించారు. ప్రతి చోటా ఒకటే మాట.. జగన్ చేతగాని తనం వల్ల రాష్ట్రం దెబ్బతింది. ఏదైనా చేయాలంటే డబ్బుల్లేవు.. అనే! ఏ ఒక్క చోట కూడా ఆయన దీనికి సంబంధించిన పనులు పలానా గడువులోగా తిరిగి మొదలెడతాం అని గానీ, పలానా గడువులోగా పూర్తిచేస్తాం అని గానీ చెప్పడం లేదు.
కేవలం జగన్ ను బద్నాం చేయడానికి మాటల గారడీలాగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. ఇదే బాటలో మరికొంత సాగితే.. జనం చంద్రబాబు మాటలను అసహ్యించుకునే రోజులొస్తాయని ప్రజలు అంటున్నారు.