ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెగ నచ్చేశారు. హామీల అమల్లో చంద్రబాబు సర్కార్ అవలంబిస్తున్న విధానాలే ఆయనంటే ఇష్టం కలగడానికి ప్రధాన కారణం. ఆయన్ను యూ టర్న్ బాబు, మోసగాడు అని ప్రతిపక్షాలు ఎన్నైనా విమర్శలు చేయొచ్చు. పదేపదే అలివికాని హామీల్ని ఇస్తూ, ఎన్నికల్లో నెగ్గుతున్నారు చూడండి… అది ఆయన గొప్పతనం అంటే. ఎంతసేపూ పాలకుల్ని విమర్శించడం మనకు అలవాటుగా మారింది.
ప్రజలేమైనా అమాయకులా? ఐదేళ్లు తమను పాలించడానికి ఎవరైతే మంచిదో నిర్ణయించుకోలేనంత అజ్ఞానంతో ప్రజలున్నారా? ఏపీ ప్రజలు ఎంతో తెలివైన వారు. అలాంటి వారిని బోల్తా కొట్టించాలంటే, వారికి ఎన్ని తెలివితేటలుండాలి? అందుకే తెలివైన నాయకుడని మరోసారి నిరూపించుకుంటున్న చంద్రబాబును చూస్తే నాకెంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. అలాగని చేతల్లో చూపలేను.
తాజాగా తల్లికి వందనం అనే సూపర్ సిక్స్ పథకానికి సంబంధించి జీవో విడుదలైంది. అందులో తల్లి ప్రాతిపదికగా రూ.15 వేలు చొప్పున అందిస్తామని ఉంది. ఇందులో చంద్రబాబు సర్కార్ మోసగించడం ఏముంది? పథకం పేరే తల్లికి వందనం. ఇప్పుడు ఆమెకే కదా బాబు సర్కార్ పెద్ద పీట వేస్తున్నది. అయితే ఈ పథకంపై ప్రతిపక్షాలు ఘాటు విమర్శ చేస్తున్నాయి. గతంలో చంద్రబాబు ఏం చెప్పారో గుర్తు చేస్తున్నాయి.
“అందుకే నేను ఆలోచించాను. తల్లికి వందనం. ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికీ, ముగ్గురుంటే ముగ్గురికీ, నలుగురుంటే నలుగురికీ తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందజేస్తాం. ఒక్కరనే నిబంధన లేదు. ఇంకా పిల్లల్ని కనండి” అని టీడీపీ కార్యకర్తలు, నాయకుల హర్షధ్వానాల మధ్య చంద్రబాబు ప్రకటించారు.
అయితే తాజాగా విడుదలైన జీవోపై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. ఇటీవల ఉచిత ఇసుక పేరుతో మోసగించారని, టన్నుకు రూ.వెయ్యికి పైగా రాబడుతున్నారనే ప్రతిపక్షాల విమర్శలపై చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. రెండు రోజుల క్రితం ఇసుకపై బాబు అన్న మాటల్ని తల్లికి వందనం పథకానికి అప్లై చేస్తూ నెటిజన్లు తమదైన సృజనాత్మక పద్ధతిలో పోస్టులు పెట్టడం విశేషం.
“తల్లికి వందనం ఒక్కరికే అని చెప్పాం, ఇచ్చేశాం. అంతే. ఇంకా నయం ఆ పిల్లల్ని నేనే బడికి తీసుకెళ్లాలి, నేనే చదివించాలి అని అనలేదు” అంటూ సెటైర్స్ మొదలయ్యాయి. అయినా తెలియక అడుగుతాను… బాబు గురించి ఇప్పుడే కొత్తగా తెలిసినట్టు విమర్శిస్తున్నారేంటి? 2014లో సంపూర్ణ రైతు, డ్వాక్రా రుణమాఫీ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారాన్ని కూడా విడిపిస్తానని బాబు చెప్పారు. అలాగే జాబు రావాలంటే బాబు రావాలని గొప్పగా ప్రచారం చేశారు. ఐదేళ్ల పరిపాలనలో బాబు చెప్పినవన్నీ జరిగాయా? లేదే?
మళ్లీ ఐదేళ్లు తిరిగే సరికి చంద్రబాబు మదిలో గొప్ప ఆలోచనలు పుట్టుకొచ్చాయి. సూపర్‌సిక్స్, ఇంకా ఏవేవో ఆయన హామీలు ఇచ్చారు. మూడు దశల్లో చంద్రబాబు 14 ఏళ్ల పరిపాలనను చూశారు. ఆయనేంటో అందరికీ తెలుసు. ఆయనకంటూ ఒక ఇమేజ్ వుంది. బాబు చెబితే… ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికీ తెలిసే కదా, ఆయనకు ఓట్లు వేసింది. మళ్లీ ఇప్పుడు ఉచితంగా ఇసుక ఇవ్వలేదని, ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేయడం లేదని విమర్శించడం ఏంటి?
ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి, చిత్తశుద్ధితో అమలు చేసిన వైఎస్ జగన్‌ను ఏమైనా ఆదరించారా? లేదే? మరి ఆ జనానికి చంద్రబాబు చెప్పినట్టు చేయలేదని విమర్శించే హక్కు ఉందా? బాబు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలంటే మూడు రాష్ట్రాల బడ్జెట్ కావాలని వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో నెత్తీనోరు కొట్టుకుని చెప్పలేదా? ఏమైనా వినిపించుకున్నారా? జనం కోసం సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తే, ఇక రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడి నుంచి నిధులు తేవాలని ప్రశ్నించే వారికి ఏం సమాధానం చెబుతారు?
-రమణ