సోషల్ మీడియాలో ఏపీ మంత్రి విపరీతంగా వైరల్ అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అన్న మాటలే నేడు బాగా ట్రోలింగ్‌కు గురి అవుతున్నాయి. నేటి సోషల్ మీడియా హీరో/విలన్ ఎవరంటే… ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఆయన్ను నెటిజన్లు టార్గెట్ చేయడానికి బలమైన కారణం లేకపోలేదు.
జగన్ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పథకానికి టీడీపీ తల్లికి వందనం అనే పేరు మార్చింది. జగన్ సర్కార్ కేవలం ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రం రూ.15 వేలు అందజేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. తమను ఆదరిస్తే ఎలాంటి షరతులు లేకుండా, ఇంట్లో ఎంత మంది విద్యార్థులు చదువుతుంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున లబ్ధి చేకూరుస్తామని చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. సూపర్ సిక్స్ పథకాల్లో ఇది కీలకమైంది.
టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు తన నియోజకవర్గంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఒక కుటుంబం పిల్లల్ని చూసి ఆగారు. పిల్లల్ని చూపుతూ రూ.15 వేలు, రూ.15 వేలు, రూ.15 వేలు, ఇదిగో ఇప్పుడే వచ్చిన ఈ పాపకు కూడా రూ.15 వేలు, అలాగే మహిళలకు రూ.18 వేలు చొప్పున తమ ప్రభుత్వం రాగానే అందచేస్తామని, ఆశీర్వదించాలని నిమ్మల రామానాయుడు గొప్పగా చెప్పారు. అంతేకాదు, తాను చెప్పింది రాసి పెట్టుకోవాలని కూడా ఆయన కోరారు.
తల్లికి వందనం పథకానికి సంబంధించిన జీవోలో మాత్రం ఒక్కో తల్లి అకౌంట్‌లో రూ.15 వేలు చొప్పున వేయనున్నట్టు పేర్కొన్నారు. గతంలో రామానాయుడు ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని ప్రచారం చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఎక్కడ ఇస్తున్నారని రామానాయుడిని నెటిజన్లు నిలదీస్తున్నారు. రామానాయుడిని హీరోగా చూస్తారా? విలన్‌గా చూస్తారా? అనేది వారివారి ఇష్టం.