ఏం త‌మాషా…త‌ప్పు ఎవ‌రిదో తేల్చండి!

నంద్యాల‌లో లోకేశ్ పాద‌యాత్ర‌లో చోటు చేసుకున్న అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబునాయుడు సీరియ‌స్ అయ్యారు. పార్టీ నేత‌ల‌తో ఆయ‌న టెలికాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ… “ఏం తమాషాగా వుందా? త‌ప్పు ఎవ‌రిదో తేల్చండి. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించిన వారు…

నంద్యాల‌లో లోకేశ్ పాద‌యాత్ర‌లో చోటు చేసుకున్న అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబునాయుడు సీరియ‌స్ అయ్యారు. పార్టీ నేత‌ల‌తో ఆయ‌న టెలికాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ… “ఏం తమాషాగా వుందా? త‌ప్పు ఎవ‌రిదో తేల్చండి. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించిన వారు ఏ స్థాయి నాయ‌కులైనా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు” అని ఆయ‌న హెచ్చ‌రించారు. 

లోకేశ్ పాద‌యాత్ర‌లో టీడీపీ సీనియ‌ర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌, ఆమె భర్త భార్గ‌వ్‌రామ్ నేతృత్వంలో దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

ఈ దాడిలో ఏవీ పండు ఊడిపోయింది. నోటి నుంచి ర‌క్తం కారింది. ఏవీ ఫిర్యాదుతో అఖిల‌ప్రియ‌, ఆమె భ‌ర్త‌తో పాటు 11 మందిపై నంద్యాల పోలీసులు కేసు న‌మోదు చేశారు. అఖిల‌ప్రియ దంప‌తుల‌తో పాటు ప‌లువుర్ని అరెస్ట్ చేశారు. ఈ నేప‌థ్యంలో పాద‌యాత్ర‌లో పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడిపై దాడి చేయ‌డాన్ని చంద్ర‌బాబు తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. ఇత‌ర పార్టీల నిల‌దీత‌ల‌కు స‌మాధానం ఏం చెప్పాల‌ని చంద్ర‌బాబు అన్న‌ట్టు తెలిసింది.

అయితే వీడియోలు చూసి నిర్ణార‌ణ‌కు రావ‌డం కంటే క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రిగిందో వాస్త‌వాలు తెలుసుకునేందుకు ముగ్గురు సీనియ‌ర్ నేత‌ల‌తో త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఇంకా స‌భ్యులెవ‌ర‌నేది నిర్ణ‌యించ‌లేదు. ఈ క‌మిటీ నంద్యాల‌లో అస‌లేం జ‌రిగిందో క్షేత్ర‌స్థాయిలో విచారించి చంద్ర‌బాబుకు నివేదించాల్సి వుంది. ఈ క‌మిటీ నివేదిక ఆధారంగా త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు.