ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు ఆ పదవిలో ఉండి పరిపాలన సాగించినంత మాత్రాన ఆయన తెలివితేటలు సరిపోవు. ప్రజల సంక్షేమం ఒక్కటే ముఖ్యమని అందుకోసం నానా అగచాట్లు పడి, పథకాలను అమలు చేసినంత మాత్రాన ఆ అనుభవం సరిపోదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి- ఆయన నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.
ఎన్నికలు జరుగుతున్నాయి అంటే అన్నింటికంటే ముఖ్యం పోల్ మేనేజ్మెంట్ అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఆ పోల్ మేనేజ్మెంట్ ను మించి ‘‘ఈజీ మేనేజ్మెంట్’’ అనే ఒక అధ్యాయం ఉంటుందని ఘనంగా నిరూపించిన రాజకీయ చాణక్యుడు చంద్రబాబు నాయుడు! పోలింగ్ నాడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉంటే ఎన్నికల సంఘం అనేది చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఆడుతున్నదా అని అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.
ఇందులో ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టడం గానీ, వారి సమర్థతను ప్రశ్నించడం గాని లేదు. కాకపోతే ఎన్నికల సంఘానికి ఏ రకంగా ఫిర్యాదు చేస్తే వారి స్పందన ఎలా ఉంటుందో ఆ శాస్త్రాన్ని చంద్రబాబు నాయుడు అవుపోసన పట్టారు. తాను ఎలాంటి చర్యలు జరగాలని కోరుకుంటారో దానికి తగిన విధంగా ఫిర్యాదులను సంధిస్తున్నారు. మొత్తానికి రోగి కోరుకున్నది వైద్యుడు ఇచ్చాడనే చందంగా వ్యవహారం తయారవుతుంది. కాదు కాదు.. కాగల కార్యాన్ని గంధర్వుల ద్వారా నెరవేరేలా చేయించడంలో చంద్రబాబు నాయుడు ఆరితేరిపోయారు.
పోలింగ్ నాడు జరుగుతున్న పరిణామాలలో తమ పార్టీకి నష్టం జరుగుతున్న ప్పటికీ.. తమ పార్టీ వారి మీద దాడులు జరుగుతున్నప్పటికీ.. తమ మీడియాలో వాటిని హైలైట్ చేసుకోవడం తప్ప ఈసీ దృష్టికి తీసుకువెళ్లి సరైన రీతిలో చర్యలు ఉండేలా చేయగల నేర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలవాటు కాలేదు.
తాడిపత్రిలో గాని, మాచర్ల, నరసరావుపేటటల్లో గాని తెలుగుదేశం నాయకులు అరాచకంగా వ్యవహరించినా సరే ఈసీ వద్ద అవి హైలైట్ కాలేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు తరఫున తెలుగుదేశం దళాలు రాష్ట్రంలో ఏకంగా 120 చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ఈసీకి ఫిర్యాదు చేయడం విశేషం. ఆ ఫిర్యాదుల మీద ఎన్నికల సంఘం స్పందించి అనేక ఉత్తర్వులు ఇచ్చింది.
కొన్నిచోట్ల పోలీసులను ఇప్పటికిప్పుడు విధుల నుంచి పక్కకు తప్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గృహనిర్బంధానికి ఆదేశించారు. ఇలాంటి చర్యలు అన్ని తెలుగుదేశం తెలివితేటల పనేనని మనం గ్రహించాలి. ప్రజాభిమానం సంపాదించుకోవడం, వారి ఓట్లను పొందగలిగే తెలివితేటలు మాత్రమే కాదు తెలివితేటలు కూడా పార్టీలకు ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో?