ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసినట్టే. ఖచ్చితమైన గణాంకాలు ఇంకా అధికారులు వెల్లడించలేదు గానీ.. ఏపీలో భారీగా పోలింగ్ నమోదు అయినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. భారీగా పోలింగ్ జరగడం అనేది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిదేళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలకు అభినందనగా జరిగిన పోలింగేనా? లేదా, చంద్రబాబునాయుడు ప్రకటించిన హామీలకు ఆశపడి జరిగిన పోలింగా? అనేది స్పష్టత లేదు. అయితే పోలింగ్ సరళిలో మరొక పరిణామం మాత్రం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఆశావహంగా కనిపిస్తోంది.
సోమవారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు మహిళలు, వృద్ధులు పెద్దసంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బూత్ లలో పోలింగ్ ప్రారంభం అయ్యే సమయానికే పెద్దసంఖ్యలో వృద్ధులు అక్కడకు చేరుకోవడం ఇవాళ చెప్పుకోదగ్గ పరిణామం. పొద్దెక్కితే ఎండ పెరుగుతుందని భయపడ్డారేమో గానీ.. తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుని తీరాలన్నట్టుగా.. వృద్ధులంతా ఉదయానికే బార్లు తీరారు. అలాగే మహిళలుకూడా పెద్దసంఖ్యలో వచ్చారు. ఇప్పుడు ఈ రెండు వర్గాల వారి ఓటు బ్యాంకు వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉండిఉంటుందనే ఆశలు ఆ పార్టీలో వ్యక్తం అవుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాష్ట్రంలోని ప్రతి ఇంటిలోనూ తాను ఒక సభ్యుడిగా అవుతానని ప్రకటించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ రాష్ట్రప్రజలతో అంతటి ఆత్మీయమైన టచ్ తో వ్యవహరించిన నాయకుడు మరొకరులేరు. వృద్ధుల్లో ప్రతి ఒక్కరికీ తాను మనవడిని అవుతానని, ప్రతిఆడపడుచుకూ తను అన్ననీ, తమ్ముడినీ అవుతానని కూడా జగన్ ప్రకటించుకున్నారు.
రాష్ట్రంలోని ప్రతి బిడ్డకు.. వారి మెరుగైన చదువుల గురించి పూర్తి బాధ్యత తీసుకునే మేనమామను తాను అవుతానని జగన్ సగర్వంగా చెప్పుకున్నారు. జగన్ ఏవేదిక మీదినుంచి ప్రసంగించినా సరే.. ‘నా అవ్వాతాతలకూ.. నా అక్కచెల్లెమ్మలకూ..’ అంటూ ప్రేమగా పలకరించడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నారు. కేవలం మాటలు మాత్రమే కాదు. ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార సరళి, నిర్ణయాలు కూడా అలాగే సాగాయి. అవ్వతాతల, అక్కచెల్లెమ్మల సంక్షేమాన్ని లక్ష్యిస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అయిదేళ్లలో తన ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీ ఇంటిదాకా చేరిఉంటే మాత్రమే నాకు మళ్లీ ఓటు వేయండి.. లేకపోతే ఓటు వేయవద్దు.. అని చెప్పి ఓట్లడిగిన నాయకుడు దేశంలోనే మరొకరు ఉండరు.
అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి వ్యక్తిత్వానికి మద్దతుగానే అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు పెద్దస్థాయిలో పోలింగ్ కు తరలివచ్చినట్టుగా వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఇదంతా ప్రభుత్వం మీద పాజిటివ్ ఓటుకు ప్రతీక అని వారు భావిస్తున్నారు. ఏ సంగతి తేలాలంటే మరో 21 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది.