ప్రస్తుతానికి జైల్లో ఉన్నప్పటికీ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయబోవడం లేదనే ప్రచారానికి మళ్లీ ఊపొచ్చింది. కుప్పంలో గత ఎన్నికల్లోనే చంద్రబాబు మెజారిటీ చాలా వరకూ తగ్గిపోయింది. అంతే కాదు.. కుప్పంలో ఈ సారి చంద్రబాబును ఓడిస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢంకా భజయించి చెబుతోంది. దీంతో చంద్రబాబు నష్ట నివారణ చర్యలకు దిగినట్టుగా కూడా కనిపించారు.
కుప్పంలో కొత్తింటిని కట్టుకోబోతున్నట్టుగా ఇటీవల నారా భువనేశ్వరి ప్రకటించుకున్నారు. ఇలా ఇన్నేళ్లకు చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కట్టాలనే ఆలోచనేదో వచ్చినట్టుగా ఉంది. మరి ఇంటి సంగతేమో కానీ.. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మారడం ఖాయమనే ప్రచారం అయితే ఆగడం లేదు!
ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేఎన్నికల్లో కుప్పానికి బదులుగా నంద్యాలనుంచి పోటీ చేయవచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఇందుకు లోలోపల చర్చోపచర్చలు జరుగుతున్నాయట. తాజాగా ఒక చిన్నసైజు పత్రిక ఇందుకు సంబంధించి ఒక కథనం ఇచ్చింది.
కుప్పంలో ఓటమి భయమో, ఎందుకు రిస్క్ చేయాలని అనుకుంటున్నారో ఏమో కానీ.. చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి పోటీ చేయరని, అందుకు ప్రత్యామ్నాయంగా నంద్యాలను ఎంచుకున్నారనే వార్తలు వస్తున్నాయి. విశేషం ఏమిటంటే.. చంద్రబాబు అరెస్టు జరిగింది కూడా నంద్యాల్లోనే!
వచ్చే ఎన్నికల్లో తన పోటీకి అనుగుణంగా నంద్యాల మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్టుగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో.. అక్కడకు ఆయన వెళ్లినట్టుగా ఉన్నారు. తన అరెస్టు ను ముందే అంచనా వేసిన చంద్రబాబు నాయుడు నంద్యాల్లోనే అరెస్టయ్యారు.
మరి నంద్యాల్లో చంద్రబాబుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? అనేది మరో లోతైన చర్చనీయాంశం. గతంలో తెలుగుదేశం ఇక్కడైతే నెగ్గింది. అయితే ఆ పరిస్థితులు వేరు. మరి కుప్పంలో పోటీ చంద్రబాబుకు రిస్క్ అని ఆయన అనుకుంటే, నంద్యాల్లో పోటీ ఆయనకు పెద్ద సవాల్ కూడా అవుతుంది. అప్పుడంటే ఏదో రోడ్లన్నీ తవ్వించి, మమ్మల్ని గెలిపిస్తేనే ఇవి పూర్తవుతాయనే బాహాటమైన బ్లాక్ మెయిల్ చేశారు. ఇప్పుడు పరిస్థితి అలా ఉండకపోవచ్చు!