తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై గంటలు మోగించి, విజిల్స్ ఊది నిరసన కార్యక్రమం ఒకటి నిర్వహించింది టీడీపీ. అయినా.. చంద్రబాబును అరెస్టు చేసింది ఏపీ ప్రభుత్వమే కానీ, ఆయనను రిమాండ్ కు పంపింది న్యాయస్థానం, కస్టడీకి అప్పగించింది కూడా న్యాయస్థానమే! ప్రభుత్వం చేసింది అక్రమ అరెస్టు అయితే.. మొదటి రోజు సాయంత్రానికే చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చేసే వారు. ఇలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు చెప్పిన నిరసన ఎవరి మీద? న్యాయ వ్యవస్థ మీదనేనా!
అదలా ఉంటే.. మరి గంటల మోగించే కార్యక్రమంలో జనసేన పాల్గొనకపోవడం గమనార్హం. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయనతో ములాఖత్ అయి వచ్చిన పవన్ కల్యాణ్.. జైల బయట పొత్తు ప్రకటన చేశారు. చంద్రబాబుకు తన పూర్తి మద్దతు ఉందని ప్రకటించారు!
ఇందులో వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. అవినీతి కేసుల్లో అరెస్టు అయినా, గతంలో చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో మద్దతు అని ప్రకటించారు. మరి ఆ ప్రకటనకు అయినా పవన్ పూర్తిగా కట్టుబడుతున్నట్టుగా లేరు!
చంద్రబాబు అరెస్టుపై నిరసనకు టీడీపీ ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ లో పవన్ భాగస్వామి కాలేదు. చంద్రబాబు కోసం పవన్ గంట మోగించలేదు. గంటలు మోగించమని జనసేన పార్టీ వాళ్లకు కూడా పవన్ ఎలాంటి పిలుపును ఇవ్వలేదు!
తెలుగుదేశం పార్టీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం అంటూ కూడా ఆ మధ్య ఒకటి జరిగింది. మరి ఏ మేరకు సమన్వయం ఏర్పడిందో ఎవరికీ తెలీదు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఉమ్మడి కార్యాచరణ ప్రకటన అంటూ కూడా ఒకటి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో.. రాష్ట్రమంతా అంటూ తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసుకున్న డప్పులు కొట్టే, విజిల్స్ వేసే కార్యక్రమం లో జనసేన ఊసే లేకపోవడం గమనార్హం.