టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య అని అంటుంటారు. మరీ ముఖ్యంగా నమ్మినోళ్లనే ఆయన నట్టేట ముంచుతుంటారని, ఇందుకు దివంగత ఎన్టీఆర్‌ను ఉదహరిస్తుంటారు. పిల్లనిచ్చి, రాజకీయ భవిష్యత్ ఇచ్చిన ఎన్టీఆర్‌ను అమానవీయంగా సీఎం పదవి నుంచి చంద్రబాబునాయుడు కూలదోయడం గురించి రకరకాల ప్రచారాలున్నాయి.
ఇప్పుడు చంద్రబాబు వెన్నుపోటుకు గురైన జాబితాలో జనసేనాని పవన్‌కల్యాణ్ పేరు సువర్ణాక్షరాలతో లిఖిస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నట్టు పవన్‌కల్యాణ్ రాజమండ్రి జైలు సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య రెండు దఫాలు సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పాలునీళ్లులా కలిసి పని చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. ఇంత వరకూ బాగానే వుంది.
కానీ అసలైన విషయానికి వచ్చే సరికి… సమన్వయం అనే మాటను టీడీపీ వ్యూహాత్మకంగా విస్మరించింది. దీన్నే చంద్రబాబు భాషలో “వెన్నుపోటు” అని అంటారని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. పొత్తులో అత్యంత కీలకమైన అంశం సీట్ల పంపిణీ. ఆ విషయంలో జనసేనతో సంబంధం లేకుండానే టీడీపీ తన పని తాను చేసుకెళుతోంది. పవన్‌కల్యాణ్‌కు కూడా ఫలానా నియోజకవర్గాల్లో తన పార్టీ పోటీ చేయాలనే ఆలోచన వుంటుందని, ఆయన అభిప్రాయాలను గౌరవించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయాలనే స్పృహ టీడీపీలో కొరవడిందని జనసేన నేతలు విమర్శిస్తున్నారు.
రెండు నెలల్లో 130 నుంచి 140 మంది అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు టీడీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 80 మందికి పరోక్షంగా చంద్రబాబు, లోకేశ్ టికెట్లపై క్లారిటీ ఇచ్చారు. ఇలా అందర్నీ కలుపుకుని ఒకేసారి అధికారికంగా ప్రకటించాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం వుంది. అయితే జనసేనతో పొత్తులో ఉన్న నేపథ్యంలో సీట్ల పంపిణీపై టీడీపీ అసలు దృష్టి సారించకపోవడం చర్చనీయాంశమైంది.
జనసేనకు గరిష్టంగా 20 సీట్లు ఇచ్చి, పవన్ సామాజిక వర్గాన్ని టీడీపీ వాడుకునేందుకు నిర్ణయించింది. వైసీపీ బలంగా ఉన్న చోట జనసేనకు కట్టబెట్టి, చేతులు దులుపుకోడానికి టీడీపీ కొన్ని సీట్లను తీసిపెట్టారని సమాచారం. అయితే చంద్రబాబు మనస్తత్వం తెలిసి కూడా పవన్ మద్దతు పలికారని, ఇందుకు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికైనా జనసేనకు పరువు దక్కాలంటే తమకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఎక్కడెక్కడ ఇస్తారో స్పష్టతకు వచ్చిన తర్వాతే టీడీపీతో కలిసి పయనించాలని పవన్‌కు కొందరు హితబోధ చేస్తున్నారు. ఈ హితవు పవన్‌కు ఎంత వరకు ఎక్కుతుందో చూడాలి.